రాజకీయం అంతా మైండ్ గేమ్‌పై నడుస్తోంటోంది. అందులో పైచేయి సాధించిన వాళ్లదే అధికారం. ఒకప్పుడు చంద్రబాబునాయుడు అంటే పొలిటికల్ జిమ్ముక్కులు చేయడంలో దిట్ట అని పేరు పొందారు. పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ చంద్రబాబు దరిదాపుల్లో ఎవరూ లేరనే వారు. అప్పట్లో కుట్ర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరడంతో ఆయన్ను మహా మేధావి అనుకునేవాళ్లు. బాబు వ్యూహాలకు ఎల్లో మీడియా తోడు కావడంతో… ప్రత్యర్థులు సైతం అబ్బో చంద్రబాబు అపర చాణక్యుడు అనే వారు.
ఇదంతా గతం. వర్తమాన రాజకీయాల్లో చంద్రబాబు ఎత్తులేవీ సాగడం లేదు. బాబు ఆలోచనల్ని, కుట్రల్ని తలదన్నడంలో వైఎస్ జగన్ మించిపోయారు. జగన్ వ్యూహాలు ప్రత్యర్థులకు అందడం లేదు. ప్రత్యర్థులను చావదెబ్బ తీసేందుకు సమయం చేసుకుని జగన్ అస్త్రాలను ప్రయోగిస్తుంటారు. సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ అందర్నీ మించిపోయారు. దీంతో టీడీపీకి నిన్నమొన్నటి వరకు బ్యాక్ బోన్‌గా ఉన్న బీసీల్లో జగన్ చీలిక తీసుకొచ్చారు.
బీసీల్లో సగానికి పైబడి ఇప్పుడు జగన్ వెంట నడుస్తున్నారు. ఇది టీడీపీకి ప్రమాదంగా మారింది. టీడీపీకంటూ ఖచ్చితమైన ఓటు బ్యాంక్ ఏదంటే… చంద్రబాబు సామాజిక వర్గం తప్ప, మరొకటి కనిపించడం లేదు. ఇదే వైసీపీ విషయానికి వస్తే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, దళితులు, గిరిజనులు, రెడ్లు, బీసీల్లో సగానికి పైగా ఆ పార్టీకి మద్దతుదారులుగా ఉన్నారు. జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా…వీరి ఓట్లు ఖచ్చితంగా వైసీపీకి వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో వ్యూహాత్మకంగా బలమైన ఓటు బ్యాంక్ అయిన బీసీలను తన వైపు తిప్పుకుంటున్నారు.
బీసీలకు రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇవ్వడంలో జగన్ తర్వాతే ఎవరైనా అనే చర్చ నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ పదవుల్లో బీసీలకు ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం చూశాం. బీసీలపై ప్రేమ తనది ఉత్తుత్తి మాటలు కాదు చేతలనే సంకేతాల్ని ఆయన పంపగలిగారు. అందుకే జగన్‌పై బీసీల్లో నమ్మకం ఏర్పడింది. ఇలా అన్ని వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నారు.
తాజాగా ప్రత్యర్థులతో జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. 175 నియోజకవర్గాలకు 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం వుందా? అని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి జగన్ సవాల్ విసరడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ముసుగు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కలుగులోంచి బయటికి రప్పించేందుకు జగన్ సవాల్ విసిరారనే చర్చకు తెరలేచింది.
నిజంగా జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందని పవన్, చంద్రబాబు నమ్ముతుంటే, దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి ఎందుకు తటపటాయిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది.
పొత్తుపై వాళ్లిద్దరి మధ్య ఉన్న లోపాయికారి తనాన్ని బయట పెట్టేందుకే జగన్ సవాల్ విసిరారు. ఒకవేళ పొత్తు ఉందని ప్రకటిస్తే జగన్ దాడి వేరేలా వుంటుంది. పొత్తు లేదని ప్రకటిస్తే… జగన్ రిలాక్ష్ అవుతారు. పొత్తు విషయమై బహిరంగంగా ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ ఎందుకు భయపడుతున్నారనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది.
జగన్ కోరుకుంటున్నది కూడా అదే. జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకపోతున్నారని జనం నమ్ముతున్నారు. జగన్ సవాల్‌కు దీటుగా సమాధానం చెప్పే పరిస్థితిలో చంద్రబాబు, పవన్ లేరు. జగన్ జనంలోకి వచ్చి మాట్లాడితే… పరిస్థితి ఇట్లే వుంటుంది. ఎంతైనా ప్రత్యర్థులతో జగన్ మైండ్ గేమ్ ఆడడంతో తోపు అనే సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి.