జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. దీంతో పుచ్చుకున్న రెమ్యూనరేషన్ కు అదనంగా ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నారు కీలక సభ్యులు. హీరో రజనీకాంత్ కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించిన నిర్మాత కళానిధిమారన్, ఆ వెంటనే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ కు కూడా ఖరీదైన కార్లను కానుకగా అందించాడు.
ఇక్కడితో జైలర్ బోనస్ ప్రక్రియ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ కళానిధిమారన్ ఇక్కడితో ఆగలేదు. ఈ సినిమాతో పెట్టిన పెట్టుబడికి మూడింతలు లాభం అందుకున్న ఈ నిర్మాత, సినిమాకు వర్క్ చేసిన 300 మందికి పైగా యూనిట్ సభ్యులకు బంగారు నాణాల్ని బహుకరించారు.
చెన్నైలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో జైలర్ సినిమా కోసం పని చేసిన 300 మందికి పైగా యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ అందించారు నిర్మాత. ఈ కాయిన్స్ పై ఓవైపు జైలర్ అని ముద్రించారు, మరోవైపు సన్ పిక్చర్స్ లోగో పెట్టారు. ఇలా 300 మందికి పైగా ఈ కాయిన్స్ అందించారు.
అంతకంటే ముందు యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు నిర్మాత. తర్వాత అందరితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతతో పాటు, దర్శకుడు నెల్సన్ కూడా పాల్గొన్నారు. రజనీకాంత్ కు బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలనే తన చిరకాల కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు నిర్మాత. సినిమా సక్సెస్ అయితే, ఇలా అందరితో ఆ ఆనందాన్ని పంచుకునే ఆనవాయితీని ఇకపై కూడా కొనసాగిస్తానని అన్నారు.