వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన ప్రారంభించిన తర్వాత.. ఆయన పాలనను చూసి రాజకీయ ప్రత్యర్థులు ఓర్వలేకపోతున్నారు. జగన్ పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుండడం చూసి.. ఏదో ఒకరమైన కుట్రలు పన్నడానికి ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఇలాంటి వక్ర ప్రచారాలు సాగించడంలో తెలుగుదేశం పార్టీ సహజంగానే ముందంజలో ఉంది. అలాంటి వారి ప్రయత్నాల్లో.. భారతీయ జనతా పార్టీతో జగన్మోహనరెడ్డికి అనుచితమైన సంబంధాన్ని అంటగట్టడం కూడా ఒకటి.
ఎవడికి వాడు.. భాజపా ప్రాపకం కోసం జగన్ ఎగబడుతున్నట్లుగా ప్రచారం చేయడం చాలా సాధారణమైన సంగతిగా మారిపోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు నెరపడం… రాష్ట్రానికి అవసరమైన పనులను చక్కబెట్టుకోవడం ఎవరికైనా తప్పదు. అలాంటి బాధ్యతను ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి కూడా చాలా సమర్థంగా నిర్వహిస్తున్నారు. తాను కేంద్రంలోని భాజపా ప్రభుత్వంలోని భాగస్వామి కాకపోయినప్పటికీ… ఆ పార్టీతో సీఎంగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు.
అవసరమైనప్పుడు వెళ్లి కేంద్రంలోని పెద్దలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రం తరఫున అవసరాలను తెలియజెబుతున్నారు. సాధించుకు వస్తున్నారు. అయితే.. కేంద్రంలోని పెద్దలను కలుస్తుండడాన్ని కూడా భాజపా స్నేహం కోసం తహతహలాడుతున్నట్లుగా ప్రచారం చేయడానికి తెలుగుదేశం తపన పడుతోంది. అలాంటి వారి నోర్లకు తాళాలు వేసేలా జగన్ తన తాజా అభిప్రాయం ప్రకటించారు.
కేంద్రంలోని మోడీ సర్కారు ఎన్ఆర్సీ, పౌరసత్వ చట్టం లను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పౌరసత్వ బిల్లును వైకాపా సమర్థించింది కూడా. అయితే.. అదే సమయంలో ఎన్ఆర్సీకి మాత్రం తాము వ్యతిరేకం అని జగన్ తాజాగా విస్పష్టంగా ప్రకటించారు. కేంద్రం ఎన్ఆర్సీ విషయంలో ఎంతో గట్టిగా ఉన్నప్పటికీ.. తన మాట కేంద్రానికి అసంతృప్తి కలిగిస్తుందని తెలిసినప్పటికీ.. జగన్ కుండబద్ధలు కొట్టినట్టుగా తన వ్యతిరేకత బయటపెట్టారు.
ఇలాంటి నేపథ్యంలో.. భాజపా ప్రాపకం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారానికి ఇది దెబ్బే. ఇంకా అలాంటి ప్రచారం ద్వారా జగన్ ఇమేజిని భంగపరచవచ్చునని ప్రత్యర్థులు ఎవరైనా అనుకుంటే గనుక వారు పప్పులో కాలేసినట్లే.