తమ ఎమ్మెల్యే నారా చంద్రబాబునాయుడి ఆచూకీ తెలపాలని కోరుతూ కుప్పం వైసీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా చంద్రబాబును కుప్పం నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తున్నారన్నారు. అయితే ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుప్పం ప్రజలు తమ సమస్యలు చెప్పుకోడానికి కనీసం బాబు క్యాంప్ కార్యాలయం కూడా లేదన్నారు. సొంత నియోజకవర్గమైన చంద్రగిరి ప్రజలు బాబును ఓడిస్తే, అమాయకులైన కుప్పం వాసులు గెలిపిస్తూ వస్తున్నారన్నారు. కుప్పంలో కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా కుప్పానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. పోలీసులు తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలిపితే అక్కడికెళ్లి సమస్యలను చెప్పుకుంటామని వారు అన్నారు.
మరోవైపు మంగళగిరి, తుళ్లూరు ఎమ్మెల్యేల ఆచూకీ తెలపాలని అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని రైతులు రోడ్డెక్కారని, వారి గోడు విని ఓ పరిష్కారాన్ని చూపాలని వారు విన్నవించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పోటాపోటీగా తమతమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశమైంది.