విశాఖపట్నంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణతో అత్యంత సన్నిహితంగా మెలిగి మీడియా దృష్టిలో పడ్డారు. ఏ పార్టీలో ఉన్నా మంత్రి పదవి గ్యారెంటీగా సంపాదిస్తారు అనే పేరున్న గంటా.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అసలు గంటాని టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఎవరూ పరిగణించడం లేదు.
మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగానే సమర్థించి వైసీపీకి మరింత చేరువయ్యారాయన. వల్లభనేని వంశీ విషయంలో అయినా కాస్తో కూస్తో చర్చలు జరగడం, ఒకటీ రెండుసార్లు ఆయన జగన్ ని కలసి మంతనాలు జరపడం చూశాం కానీ గంటా ఎపిసోడ్ లో అవేం లేకపోయినా ఆయన అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నారు.
ఇప్పటివరకూ టీడీపీకి చెందిన ఏ ఎమ్మెల్యే కూడా స్థానిక నియోజకవర్గాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ రోడ్డెక్కడం చూశాం కానీ, అధికారులతో కలసి సమీక్షలు జరపడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలాగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ఎవరూ చేయలేదు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇంచార్జిలు ఉండగా ఎవరూ అంత సాహసం చేయలేరు కూడా. ఒక్క విశాఖ ఉత్తరం లో మాత్రం పరిస్థితి భిన్నం.
అధికార పార్టీ ఎమ్మెల్యేలాగే గంటాకి అన్ని ప్రోటోకాల్స్ జరిగిపోతున్నాయి. స్థానిక నేతలు రగిలిపోతున్నా.. కొంతమంది పెద్దల సాహచర్యం ఉండటంతో గంటాకు ఎదురే లేకుండా పోయింది. త్వరలో జరగబోతున్న విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో కూడా గంటా చురుగ్గా పాల్గొంటారని తెలుస్తోంది. అంటే దాదాపుగా గంటా వైసీపీ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నారు, ఆ పార్టీ కూడా ఆయనను అలాగే ఆదరిస్తోంది. ఇంతకీ గంటా ఏ పార్టీలో ఉన్నట్టు? ఒకవేళ వైసీపీకి మద్దతు తెలిపితే వంశీ విషయంలో జరిగిన రాద్ధాంతం ఇక్కడ ఎందుకు లేదు? పదవి వదలకుండా పార్టీ మారే అవకాశం ఒక్క గంటాకే ఇచ్చారా? గంటా విషయంలో వైసీపీ తమ నిబంధనలను పక్కనపెట్టిందా?
కండువా ఒక్కటే లేదు, గంటా విషయంలో మిగతాదంతా సేమ్ టు సేమ్ అనుకుంటున్నారు ప్రజలు. దీనిపై అధికార పార్టీ క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇలాంటి కలయికల్ని తగ్గించాలి. రెండూ చేయకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలుపుకొంటూ పోతే.. వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన చంద్రబాబుకీ, ఆదర్శాలు చెప్పిన జగన్ కీ తేడా లేకుండా పోతుంది