జ‌గ‌న్ స్ఫూర్తితో ధైర్యం తెచ్చుకోండి బాబూ, ప‌వ‌న్‌!

“జ‌గ‌న్‌పై ఈడీ, సీబీఐ కేసులున్నాయి. పొర‌పాటున జ‌గ‌న్‌ను సీఎం చేస్తే అంతే సంగ‌తులు. ఎందుకంటే మోడీ, అమిత్‌షాల‌ను ప్ర‌త్యేక హోదా అడిగే ధైర్యం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై వారిని ప్ర‌శ్నించే ద‌మ్ము, ధైర్యం…

“జ‌గ‌న్‌పై ఈడీ, సీబీఐ కేసులున్నాయి. పొర‌పాటున జ‌గ‌న్‌ను సీఎం చేస్తే అంతే సంగ‌తులు. ఎందుకంటే మోడీ, అమిత్‌షాల‌ను ప్ర‌త్యేక హోదా అడిగే ధైర్యం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై వారిని ప్ర‌శ్నించే ద‌మ్ము, ధైర్యం జ‌గ‌న్‌కు లేవు. కేంద్రాన్ని ఏమైనా అడిగితే అక్ర‌మాస్తుల కేసులో త‌న‌ను జైల్లో వేస్తార‌ని జ‌గ‌న్‌కు భ‌యం . అందుకే కేంద్ర పెద్ద‌ల ద‌గ్గ‌ర జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు. జ‌గ‌న్‌ను గెలిపిస్తే కేంద్రానికి ఊడిగం చేస్తాడు” అని ఎన్నిక‌ల‌కు ముందు అనేక సంద‌ర్భాల్లో టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాన్ వైసీపీ అధినేత‌పై మండిప‌డ్డారు.

ఎన్నిక‌లు ముగిశాయి. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. కేంద్రంలో మోడీ స‌ర్కార్ తిరిగి అధికారాన్ని నిలుపుకొంది. ఎన్నిక‌ల‌కు  ముందు ప్ర‌ధాని మోడీ, పులివెందుల మోడీ (జ‌గ‌న్‌), తెలంగాణ మోడీ (కేసీఆర్‌) క‌ల‌సి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేయాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించిన  బాబుకు ఓట‌మి భ‌యాన్ని క‌లిగించింది. మోడీ, అమిత్‌షాల‌పై నోరు తెర‌వ‌డానికి ధైర్యం చాల‌డం లేదు. ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను విలీనం చేసుకున్నా…మోడీ, అమిత్‌షా చ‌ల్ల‌ని చూపు కోసం చంద్ర‌బాబు ప‌రిత‌పిస్తున్నాడు.  

ఇక ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆయ‌న ఏకంగా ఈ దేశానికి అమిత్‌షానే స‌రైన లీడ‌ర్ అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నాడు. అమిత్‌షా అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని ప‌దేప‌దే ప్ర‌క‌టిస్తున్నాడు. బీజేపీలో జ‌న‌సేన విలీనం ఒక్క‌టే మిగిలి ఉందంటున్నారు.

జాతీయ పౌర‌ప‌ట్టిక (ఎన్ఆర్‌సీ)కి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో వైసీపీ, టీడీపీ స‌భ్యులు మ‌ద్ద‌తు ప‌లికారు. మ‌రోవైపు ఆ బిల్లుకు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏపీలో కూడా ముస్లింలు, ప్ర‌జాసంఘాలు భారీ ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌లు మాత్రం త‌మ‌కేమీ సంబంధం లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ త‌మ ప్ర‌భుత్వం ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేక‌మ‌ని తేల్చి చెప్పాడు. అంతేకాదు ముస్లింల‌కు అండ‌గా ఉంటామ‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి కేంద్రానికి ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఈడీ, సీబీఐ కేసులున్న జ‌గ‌న్‌కు లేని భ‌యం బాబు, ప‌వ‌న్‌ల‌కు ఎందుకో అర్థం కావ‌డం లేదు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ స్ఫూర్తితో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ధైర్యం తెచ్చుకుని కేంద్రానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతారో లేదో చూడాలి.