కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అనేది యావత్తు రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చగలిగిన పొటెన్షియల్ ఉన్న అంశం. అయితే.. దీని ద్వారా లబ్ధి పొందేది ఎవరు? వారు ఎవరికి ఓటర్లు? అనే నీచమైన లెక్కలు వేసిన పార్టీలు మాత్రం.. ఈ అద్భుతమైన ప్రజోపయోగం గల ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురాలేదు. కానీ తాజాగా జగన్మోహన రెడ్డి ఉక్కుఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కేవలం అదొక్కటే కాదు.. మూడున్నరేళ్లలోగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం అని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలంతా ఇప్పుడు.. కల్లబొల్లి మాటలు చెప్పే డ్రామాకు, చిత్తశుద్ధికి ఇదే తేడా అని వ్యాఖ్యానిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలెట్టిన ప్రయత్నానికి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సమర్థంగా గండికొట్టాయి. ఆ ప్రాజెక్టు అటకెక్కింది. కానీ.. రాష్ట్రాన్ని అత్యంత అమానవీయంగా రెండు ముక్కలు చేసినప్పుడు… కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ప్రకటించింది. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగిపోయి.. ఎన్డీయే వచ్చిన తర్వాత.. ఆ హామీలన్నిటినీ తుంగలో తొక్కింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో భాగస్వామిగా అధికారం వెలగబెట్టినంత కాలమూ చంద్రబాబు దీని గురించి పట్టించుకోలేదు. కేంద్రంతో సున్నం పెట్టుకున్నాక.. కేవలం భాజపా మీద బురద చల్లడానికి ఇది ఒక అవకాశం లాగా వాడుకోవాలని అనుకున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి.. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రకటనలతో వదిలేశారు. పూర్తిగా ప్రభుత్వమే దీనిని చేపడుతుందన్న చంద్రబాబు.. ఆ తర్వాత పట్టించుకోలేదు.
ఇప్పుడు జగన్ సర్కారు వచ్చింది. ఆయనలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉన్న అసలైన చిత్తశుద్ధి ఏమిటో ఇప్పుడు కనిపిస్తోంది. ఆయన కేవలం శంకుస్థాపన చేయడం మాత్రమే కాదు.. మూడున్నరేళ్లలో దాన్ని పూర్తిచేసేస్తానని కూడా స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు.. అధికారం ముగిసిపోయే ముందు.. ఒక డ్రామాలాగా.. దీనివైపు దృష్టిసారిస్తే.. జగన్మోహనరెడ్డి.. తాను ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే.. మొదలెట్టి.. అధికారం ముగిసేలోగా పూర్తిచేస్తానని కూడా మాట ఇస్తున్నారు.
షూటింగ్ ముహూర్తం నాడే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించే సినీ దర్శకుడి కాన్ఫిడెన్స్ లాగా.. జగన్మోహనరెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్టును ఇంత స్పష్టమైన వేగంతో పూర్తి చేయడానికి కట్టుబడి ఉండడం గొప్పే అని ప్రజలు అనుకుంటున్నారు.