ఒక్కసారి వైసీపీకి కమిట్ అయితే…?

ఇది సినిమా డైలాగ్ కాదు. ఒక సాధరణ రాజకీయ డైలాగే. వైసీపీ కోసం ఇపుడు మంత్రులు పెద్దలు ఎమ్మెల్యేలు అంతా ప్రచారంలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. గిర్రున ఏడాది కాలం తిరిగేస్తే చాలు…

ఇది సినిమా డైలాగ్ కాదు. ఒక సాధరణ రాజకీయ డైలాగే. వైసీపీ కోసం ఇపుడు మంత్రులు పెద్దలు ఎమ్మెల్యేలు అంతా ప్రచారంలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. గిర్రున ఏడాది కాలం తిరిగేస్తే చాలు సార్వత్రిక ఎన్నికలు ముందున్నాయి. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి తీరాలి. ఆ గెలుపు కూడా తిరుగు లేకుండా ఉండాలి.

అందుకోసం వైసీపీ మంత్రులు నాయకులు జోరు పెంచేశారు. ఉత్తరాంధ్రాలో రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇపుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఒక సీటులో విజయం ఖాయం. రెండవ దాని విషయంలో కాస్తా దృష్టి పెట్టాలి. శ్రీకాకుళం జిల్లా లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం అయింది. ఇండిపెండెంట్ గా బూర్జ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ ఒకరు పోటీకి సిద్ధపడడంతో ఎన్నిక వచ్చి పడింది.

ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీటుకు ఎటూ బలమైన పోటీ ఉంది. ఈ నేపధ్యంలో శ్రీకాకుళంలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతోనే సామాజిక న్యాయం సాధ్యం. దానికి ఉత్తరాంధ్రాలో అభ్యర్ధుల ఎంపిక ఉదాహరణ అన్నారు ఆయన.

ఒక ఎమ్మెల్సీ సీటుని వాడబలిజకు మరొకటి యాదవులకు ఇచ్చి జగన్ సామాజిక న్యాయాన్ని పాటించారు అని ధర్మాన చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుందని అలాంటిది పైసా ఖర్చు లేకుండా చట్ట సభలకు సామాన్యులను పంపుతున్న ఘనత జగన్ దే అన్నారు. బడుగు సామాజిక వర్గాలను ఆదరిస్తున్న జగన్ కి వైసీపీకి ఓటేయాలని ఆయన కోరారు.

ఒక్కసారి వైసీపీకి ఎవరైనా ఓటేస్తే ఇక వేరే పార్టీకి వేయరు అంటూ కొత్త రాజకీయ సూత్రం ఆయన చెప్పారు. వైసీపీ పాలనను పార్టీ విధానాలను చూస్తే ఎవరూ మళ్ళీ వేరే పార్టీ వైపుగా మళ్ళరని ధర్మాన అంటున్నారు. అంటే ఒక్కసారి కమిట్ అయితే వైసీపీతోనే లైఫ్ లాంగ్ అని మంత్రి గారు చెబుతున్నారన్నమాట. అదే జరిగితే జగన్ ముప్పయ్యేళ్ళ సీఎం లక్ష్యం నెరవేరినట్లే.