ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు పోటీ చేయడం కామన్. వైసీపీ ఎందుకు పోటీ చేయాలి. అసలు ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు నిలబడుతోంది ఇలాంటి ప్రశ్నలను విపక్షాలు వేస్తున్నాయి. వైసీపీకి పోటీ చేసే అర్హత లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాయి. దానికి సిల్లీ రీజన్స్ చెబుతున్నాయని వైసీపీ నేతల నుంచి వినిపిస్తున్న మాట.
నిన్న తెలుగుదేశం నేడు బీజేపీ ఇలా విపక్షాలు అన్నీ కలసి వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ నుంచి ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్ అయితే శాసన మండలి రద్దు కి తీర్మానం చేసిన వైసీపీ మండలి ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి ఎలా నిలబెట్టింది అని ప్రశ్నించారు. సీఎం జగన్ అయితే ఒక్కసారి కూడా శాసనమండలిలో అడుగు పెట్టలేదు అని ఎద్దేవా చేసారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని టీడీపీ నేతలు కూడా అంటున్నాయి. వైసీపీ మండలి వద్దు అనుకుంది కాబట్టి పోటీ సైతం వద్దు అని పక్కకు జరగాలని తమ్ముళ్ళు అంటున్నారు. దీని మీద వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 1985లో మండలిని రద్దు చేశారని, ఇదే తమ పార్టీ విధానం అని చెప్పారని, కానీ 2006లో మండలి పునరుద్ధరిస్తే టీడీపీ పోటీ చేసింది కదా తన విధాన నిర్ణయాన్ని ఎలా మార్చుకుందని ప్రశ్నించారు. తాము రద్దు అని ప్రతిపాదించామే తప్ప అది అమలు కాలేదన్నది గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఎన్నికల్లో గెలవాలని చూడాలి తప్ప తమను పోటీ చేయవద్దు అనడమేంటి అని వారు ఫైర్ అవుతున్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేకనే ఇలా సిల్లీ రీజన్స్ చెబుతున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ నేతలు పట్టుదలగా తీసుకుని ముందుకు సాగుతున్నారు
ఈ నేపధ్యంలో విపక్షాలు అధికార దుర్వినియోగం, ఓటర్ల జాబితా తప్పులు అంటూ కువిమర్శలు చేస్తూ వచ్చాయని, ఇపుడు అయితే వైసీపీ ఎందుకు పోటీ చేయడం అంటున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతే నిందలు వేయడానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని వైసీపీ నేతలు విపక్షాల మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు.