ఎమ్బీయస్‍: కరోనా టీకాలనేం చేయాలి?

టీకాలు వేయడానికి ప్రభుత్వ సిబ్బందికి టార్గెట్లు పెడితే అనర్థాలు జరగడానికి అవకాశం వుందంటూ ‘ఏసా, గణేశా..’ అనే వ్యాసంలో నా భయాన్ని వెలిబుచ్చాను. నా భయం నిర్హేతుకం కాదని డిసెంబరు 11 నాటి ‘‘సాక్షి’’…

టీకాలు వేయడానికి ప్రభుత్వ సిబ్బందికి టార్గెట్లు పెడితే అనర్థాలు జరగడానికి అవకాశం వుందంటూ ‘ఏసా, గణేశా..’ అనే వ్యాసంలో నా భయాన్ని వెలిబుచ్చాను. నా భయం నిర్హేతుకం కాదని డిసెంబరు 11 నాటి ‘‘సాక్షి’’ వార్త నిచ్చింది. ‘‘ఉత్తుత్తి టీకాలు’’ అనే హెడ్‌లైన్స్ కథనంలో ఒక్క డోసూ వేసుకోకపోయినా ఎస్సెమ్మెస్ ద్వారా సర్టిఫికెట్టు పంపేశారని, గడువు ప్రకారం రెండో డోసు వేసుకోకపోయినా వేసుకున్నట్లు మెసేజి వచ్చేసిందని రాశారు. డిసెంబరు నెలాఖరులోగా రాష్ట్రంలో 100% వాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో వైద్య సిబ్బంది యిలాటి అక్రమాలకు పాల్పడుతున్నారని రాశారు. ఇదేమిటని అడగడానికి వెళ్లినవారికి ‘మీకు గుర్తు చేయడానికే అలా యిచ్చాం. ఎలాగూ వచ్చావుగా, వేయించేసుకుని వెళ్లు.’ అంటున్నారట. ఇది తెలంగాణ గురించిన కథనమే అయినా, ఆంధ్రలో కూడా యిలాగే జరుగుతున్నట్లు వినవస్తోంది. టార్గెట్లు పెరిగిన కొద్దీ యిలాటి గోల్‌మాల్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.

పైన చెప్పిన సెప్టెంబరు వ్యాసంలో రాశాను – ‘గ్రామీణుల్లో వాక్సిన్ హెజిటన్సీ వుంది. టీకాలు వేయించుకోవడానికి ఎవరూ రావటం లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగికి పై అధికారి నుంచి ఏ మధ్యాహ్నమో ఫోన్ వస్తుంది ‘మనకు టార్గెట్ ఫిక్స్ చేశారు, మీ వూరికి వెయ్యి టీకాలు కోటా ఎలాట్ చేశాం, రాత్రికల్లా పూర్తి చేయి, వాళ్లు రాకపోతే ఇంటికి వెళ్లి పొడిచి రండి’ అంటాడు. ఇక ఆ క్రింది స్థాయి ఉద్యోగి యింటింటికి వెళ్లి టీకాలు వేస్తాడా లేదా అన్నది అతని నిజాయితీపై ఆధారపడి వుంటుంది. వాళ్లలో కొందరు యింట్లోనే కూర్చుని, ఆశా వాళ్ల దగ్గరో, ఏ సంక్షేమ పథకంలోని లిస్టులోంచో, ఆధార్ కార్డుల నెంబర్లు, లేదా ఓటరు ఐడిలు సంపాదించి వాళ్లకు టీకాలు యిచ్చినట్లు సిస్టమ్‌లో ఎంట్రీ చేసేయవచ్చు. టీకా వేయకుండానే వేసినట్లు రికార్డులు సృష్టిస్తే అప్పుడు టీకాలేం చేస్తారు? ఉండవలసినదాని కంటె ఎక్కువ స్టాకు కనబడితే అదో తంటా. వాటిని మాయం చేయాల్సి వస్తుంది. ప్రయివేటు సెక్టార్‌కి అమ్ముకుంటే అదో ఫ్రాడ్. గుట్టుచప్పుడు కాకుండా పగలగొట్టేస్తే మహాపాపం.’

ఫ్రాడ్ చేయడానికి ప్రయివేటు సెక్టార్‌లో డిమాండు లేదు. ప్రభుత్వం ఉచితంగా వేస్తానంటేనే ఎవరూ ముందుకు రావటం లేదు. ఇక ప్రయివేటుగా కొని ఎవరు వేయించుకుంటారు? అందువలన టీకాలు పగలగొట్టడమే జరుగుతోందని వూహించవచ్చు. ఆఫ్రికా దేశాల్లో టీకాలు లేక అలో లక్ష్మణా అంటున్నారు, మనం చూస్తే యిలా..! టార్గెట్ పెంచిన కొద్దీ యీ విధ్వంసం పెరుగుతూండవచ్చు అని నేను రాసిన కొద్ది రోజులకే మోదీ పుట్టిన రోజంటూ రెండున్నర కోట్ల డోసులు ఒక్క రోజులో వేసేశామని ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో రోజుకి 70 లక్షల డోసులు వేస్తూండేవారు. మూడు రెట్లకు మించి టీకాలు వేయాలంటే ఒక్కసారిగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది? సిబ్బందికి అదనంగా చేతులు మొలుస్తాయా? మోదీ పుట్టినరోజు కదాని జనాలు క్యూలు కడతారా? అవేళ యిలాటి జుగాడ్ ఏదో జరిగి వుంటుందనుకున్నాను. ఇవన్నీ చూసే కాబోలు ఆ నెలాఖరులో యుకె ‘మీరు టీకా వేసినట్లు సర్టిఫికెట్టు యిచ్చినా మేం నమ్మం’ అనేసింది.

ఇది వినగానే మనకు అహం పొడుచుకు రావడం సహజం. కానీ మనలో మన మాటగా అనుకుందాం – ఎంతో కొంత డిసిప్లిన్ ఏడ్చిన దక్షిణాది రాష్ట్రాలలోనే యిలా వుంటే అస్తవ్యస్తానికి మారుపేరైన ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్ని అడ్డదారులు తొక్కి వుంటారు? ఇలా వూహించి ప్రభుత్వ సిబ్బందిపై కోపం తెచ్చుకుని ప్రయోజనం లేదు. జనాలు రాకపోతే వాళ్లు మాత్రమేం చేస్తారు? టీకా వేయడానికి లంచం పుచ్చుకుంటే వాళ్లను దండించవచ్చు. ఊరికే వేస్తాం మహాప్రభో, రండి అన్నా జనాలు రాకపోతే తమ ఉద్యోగాలు నిలుపుకోవడానికి కాకి లెక్కలు రాసినవాళ్లని తిట్టగలమా? ప్రజలు కరోనా టీకాలు ఎందుకు వేయించుకోవడం లేదు? అనే ప్రశ్నపై ఎవరైనా నిజాయితీగా రిసెర్చి చేసి, ప్రకటిస్తే బాగుంటుంది.

కరోనా టీకాల విషయంలో జరిగినట్లు మరే టీకాకు జరగలేదు. కొంతకాలం టీకాల కోసం నానా హైరానా పడ్డారు. ‘మీకు తెలిసున్న ఆస్పత్రివాళ్లుంటే చెప్పండి, ఎంతదూరమైనా వెళ్లి వేయించుకుంటాం.’ అని నన్నే చాలామంది అడిగారు. ప్రజలందరూ ఒకరి నొకరు ‘ఇంకా వేయించుకోలేదా? మేం వేయించుకున్నాం, సైడ్ ఎఫెక్ట్‌లు ఏమీ లేవు’ అంటూ పలకరించుకున్నారు. కొంతమంది 18 ఏళ్లకు లోపున వున్న వాళ్ల పిల్లలకు దొంగచాటుగా టీకాలు వేయించేశారు. అనేక పబ్లిక్ ప్లేసులు టీకాలు వేయించుకోక పోతే ప్రవేశం లేదన్నాయి. విపరీతమైన డిమాండు వుండడంతో ‘తగినన్ని టీకాలు లేవు, ప్రభుత్వం ముందుగా ప్లాన్ చేయలేదు’ అనే విమర్శలు ముంచెత్తాయి. ప్రభుత్వం సంజాయిషీ చెప్పుకోలేక తలకిందులైంది. టీకాల ఉత్పత్తి పెంచమని కంపెనీలకు ఆదేశాలిచ్చింది. పలు రాష్ట్రప్రభుత్వాలు ఆ కంపెనీలకు స్థలాలిచ్చి, మా దగ్గర ఫ్యాక్టరీలు పెట్టమన్నాయి. అర్జంటుగా టీకాలిస్తావా? ఛస్తావా అని ముఖ్యమంత్రులు టీకా ఉత్పత్తిదారులపై ఒత్తిడి తెచ్చారు. టీకాలు తేలేని ముఖ్యమంత్రివి, నువ్వూ ఓ ముఖ్యమంత్రివేనా? అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.

ముందు చెప్పిన గడువుకి కాకపోయినా, ఆలస్యంగానైనా టీకాలు మార్కెట్లోకి వచ్చిపడ్డాయి. వచ్చాక చూస్తే యిప్పుడు టీకాల డిమాండు హఠాత్తుగా పడిపోయింది. ప్రయివేటు సెక్టార్‌కు 25% కేటాయిస్తే జులై నాటికి 7% డిమాండు కూడా లేకపోయింది. సెప్టెంబరు నాటికి 6% అయింది. ఇప్పుడైతే ఏ 5శాతమో వుండి వుంటుంది. వాళ్ల దగ్గర లక్షలాది డోసులు పడి వున్నాయి. ఎక్స్‌పైరీ డేటు దగ్గర పడుతోంది, అడిగినవాళ్లకి బూస్టర్ డోసులు వేసేస్తాం, అనుమతివ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్లు యింకా ఔననలేదు. టీకాలు వేయవలసిన జనాభాలో 86% మందికి మొదటి విడత టీకాలు వేశామని, రాష్ట్రాల వద్ద యింకా 7 కోట్ల డోసుల స్టాకుందని ఆరోగ్యమంత్రి డిసెంబరు 10న ప్రకటించారు. డిమాండు తగ్గిపోవడంతో సీరమ్ తమ కోవిషీల్డు ఉత్పత్తిని సగానికి తగ్గిస్తామని ప్రకటించింది. టీకా రెండు డోసులు పూర్తయినవారు 55% వున్నారంటున్నారు.

86కి, 55కు మధ్య ఎంత వార వుందో చూడండి. అంటే గబగబా మొదటి డోసు వేయించుకున్నవాళ్లు రెండో డోసుకి తాత్సారం చేస్తున్నారన్నమాట. కొన్ని దశల్లో టీకాకరణ వేగం ఎలా వుందో గమనిస్తే యిబ్బంది ఎక్కడుందో అర్థమవుతుంది. జులై 1-10 మధ్య రోజుకి 40 లక్షల డోసులు వేస్తే, ఆగస్టు 1-10 మధ్య అది 49 అయింది. సెప్టెంబరు 1-10 మధ్య 76 అయింది. అక్టోబరు 1-10 మధ్య 62కి తగ్గింది. నవంబరు 1-10 మధ్య బొత్తిగా 40కి పడిపోయింది. నవంబరు 11-20 మధ్య 57 అయి, 21-30 మధ్య 76 అయి, డిసెంబరు 1-10 మధ్య 79కి చేరుకుంది. డిసెంబరు 31 లోగా 189 కోట్ల డోసులు వేయాలనే లక్ష్యం చేరాలంటే డిసెంబరు 11 నుంచి 31 లోపున రోజుకి 2.59 కోట్లమందికి వేయాలి. అది అసంభవమని అందరికీ తెలుసు. దీనికి ప్రభుత్వాన్ని తప్పు పట్టి ప్రయోజనం లేదు. ప్రజలు ముందుకు రాకపోతే వాళ్లేం చేస్తారు? అప్పటికీ టీకాకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లింకు పెడదామని చూస్తున్నారు. మరీ ఒత్తిడి చేస్తే ఎమర్జన్సీ టైములో కుని ఆపరేషన్లలా తయారవుతుందని, ప్రజలు తిరగబడతారనీ భయం వుంది.

అసలు ప్రజలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఆరోగ్య సిబ్బందిని అడిగితే ‘టీకా వేయించుకుని ఏం లాభమయ్యా, కరోనాను ఆపలేక పోతోందిగా’ అంటున్నారని చెప్పారు. పోనీ అలా అని జాగ్రత్తగా ఏమైనా వుంటున్నారా? అబ్బే, కరోనాను మర్చిపోయినట్లే ప్రవర్తిస్తున్నారు. మాస్క్ వుంటోంది కానీ జేబులో వుంటోంది. పోలీసు అడిగితే చూపించడానికి! సామాజిక దూరమా, మట్టిగడ్డలా? ఊరేగింపులు, సభలు, సినిమాలు, జాతరలు, పెళ్లిళ్లు అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. ‘కరోనా నిబంధనలు పాటిస్తూ…’ అని ఓ మాట చేరుస్తున్నారంతే! రెండవ ప్రపంచయుద్ధం రోజుల్లో వివాహ ఆహ్వానపత్రికలు చూస్తే ‘ఎవరి బియ్యం వారే తెచ్చుకోవలెను’ అనే లైను కనబడుతుంది. అప్పట్లో బియ్యం కొరత వుండేది కాబట్టి, ప్రభుత్వం బియ్యం వినియోగంపై ఆంక్షలు పెట్టిందట. అందుకని అధికారులు అడిగితే ‘ఆహూతులు వాళ్ల బియ్యం వాళ్లే తెచ్చుకున్నారు, మేం పరిమితికి మించి వాడలేదు’ అని పెళ్లివారు చెప్పుకోవడానికి అలా వేసేవారుట! ఇప్పుడీ ‘కరోనా జాగ్రత్తలు’ కూడా అలాగే తయారయ్యాయి.

పోనీ కరోనా మాయమై పోయిందా ఏమన్నానా? సెకండ్ వేవ్‌లో తన తడాఖా చూపించింది కదా. 2020, 2021లలో కనీసం ఒక ఆత్మీయుణ్నయినా కోల్పోని వ్యక్తి నాకు తారసపడలేదు. చావు తప్పించుకున్నవాళ్లు కూడా ఆస్పత్రి బిల్లుతో సగం చచ్చారు. కరోనా యింకా వేషాలు వేస్తూనే వుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ వేషంలో వచ్చింది. ఇంకోదానికై మేకప్ వేసుకుంటేదేమో! ఈ ఒమైక్రాన్ గుణవిశేషాల గురించిన చర్చ తెమలటం లేదు. నాకు అర్థమైనంతవరకు దానికి విస్తరణ వేగం ఎక్కువ, కానీ లక్షణాలు, తీవ్రత తక్కువ. కనుమరుగయ్యే ముందు వచ్చిన వెర్షన్ యిది అంటున్నారు. అవునో కాదో కొన్ని నెలల తర్వాత వాళ్లే చెప్తారు లెండి. డెల్టా వేరియంట్ ఇండియాలో వీక్ అయిందేమో కానీ యూరోప్‌లో, రష్యాలో, అమెరికాలో హడలెత్తిస్తోంది. కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు మళ్లీ విధించారు. అమెరికా జనాభాలో 60% మందికి రెండు డోసులూ పడినా రోజుకి 2 వేల దరిదాపుల్లో మరణిస్తున్నారు. అంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది రాలేదన్నమాట. ఇతర దేశాల నుంచి మనకు రాకపోకలు ఎక్కువ కాబట్టి వ్యాధి మనకూ వ్యాపిస్తుందన్న భయం వుండాలి కదా!

మన దేశంలో అవగాహన తక్కువ కాబట్టి వాక్సిన్ పట్ల విముఖత వుందనుకుంటే, మరి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అదే పరిస్థితి ఉందెందుకు? టీకా వేయించుకుంటే లాటరీ టిక్కెట్టిస్తాం, చేతికి డబ్బిస్తాం అనడం దేనికి? తక్కిన వాక్సిన్‌లకు యీ అవస్థ లేదు కదా, మరి దీనికే ఎందుకు? ప్రజలెలా ఆలోచిస్తున్నారో సర్వేలు చేసి కొన్నేళ్లు పోయిన తర్వాత చెప్తారేమో! ఈలోగా నాకు తోచినది నేను చెప్తాను. మామూలుగా వాక్సిన్ వేయించుకుంటే కనీసం ఏడాది పాటు రోగం రాకూడదు. దీని విషయంలో వచ్చేస్తోంది. ఎందుకంటే యిది ఔషధం కనుక్కోవడానికి ముందే, వైరస్ స్థిరపడడానికి ముందే తయారుచేసిన ‘వాక్సిన్’. అసలు దీనిని వాక్సిన్ అనకూడదని, వాక్సిన్ లాటిది అనాలని ఓ వ్యాసంలో రాస్తే కొంతమందికి కోపం వచ్చింది. ఇప్పుడు వైరాలజిస్టులే చెపుతున్నారు – ఇది రోగాన్ని నిరోధించదు, రోగతీవ్రతను తగ్గిస్తుందంతే! అని. రోగతీవ్రతను తగ్గించినా మంచిదే కదా, ఆసుపత్రి బెడ్స్, ఆక్సిజన్ సిలండర్లు, వెంటిలేటర్లు, ఎక్మోల కొరత, చావులు, ఆసుపత్రి బిల్లు యివన్నీ తగ్గుతాయి కదా! కానీ యీ విషయం జనాల మెదళ్లలోకి ఎక్కటం లేదు. వాక్సిన్ అన్నారు కానీ పనిచేయటం లేదు అనే భావనే మనస్సులో పడిపోయింది. వీళ్లు వాక్సిన్ అనకుండా మరో పేరు పెట్టాల్సింది.

కొత్త వేరియంట్ రాగానే వాక్సిన్ పని చేయటం లేదు. వాక్సిన్ తీసుకున్న 9 నెలలకు బూస్టర్ తీసుకోక పోతే లాభం లేదంటున్నారు, కొందరు ఆర్నెల్లే అంటున్నారు. ‘ఈ లోపున చికిత్సకు ఫైజర్, మెర్క్ వాళ్ల మందులు వచ్చేశాయి. బాగానే పనిచేస్తున్నాయట. టీకా తీసుకోకపోయినా ఫర్వాలేదు, అంతగా వస్తే ఆ మందుతో నయం చేయించుకోవచ్చు’ అనుకుంటున్నారు తప్ప, టీకా వలన దుష్ఫలితాలు ఏమీ లేవు కదా, ఉత్తినే వస్తోంది కదా, పడుంటుందని వేయించుకుంటే ఏం పోతుందని అనుకోవటం లేదు. మన దేశంలో మార్చి నుంచి విస్తృతంగా టీకాలు వేయించుకున్న వాళ్లున్నారు. వేయించుకుని 9 నెలలై పోయింది కాబట్టి, డిమాండు లేక అనేక డోసులు వ్యర్థంగా పడి వున్నాయి కాబట్టి 12-18 సం.ల వయసు వారికి టీకాలివ్వడం మొదలుపెట్టవచ్చు కదా అని కొందరంటున్నారు. దానిపై ప్రభుత్వం తేల్చటం లేదు. సప్లయి లేనప్పుడు కోవిషీల్డు డోసుల మధ్య వ్యవధి 12-16 వారాలన్నాం, యిప్పుడు 8 వారాలు చేయవచ్చు కదా అంటే అదీ తేల్చటం లేదు.

పోనీ అడిగిన వాళ్లకు బూస్టరు డోసులు యివ్వవచ్చు కదా అంటున్నారు కొందరు వైద్యులు. అదీ తేల్చటం లేదు. సరే అని గేట్లు తెరిచినదాకా వుండి డిమాండు పెరిగితే అప్పుడు టీకాల స్టాకు సరిపోక మళ్లీ అలజడి వస్తుందన్న భయమో ఏమో తెలియదు. బూస్టరు డోసు యివ్వాలంటే మళ్లీ అదే టీకా వేయించుకోవాలా, లేక మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో వేరే రకమైన టీకా వేయించుకోవాలా? కొందరు మంచిదంటున్నారు, కొందరు కాదంటున్నారు. ఈ చర్చ సాగుతూండగానే, కొందరు ప్రజలు టీకాలు వృథాగా పారేస్తున్న ప్రభుత్వోద్యోగుల వద్దకు వెళ్లి 18 ఏళ్ల లోపు పిల్లలకు యిప్పించడమో, తాము బూస్టర్ డోసులు వేయించుకోవడమో చేస్తున్నారట. యుపిలో ఎన్నికలు రాబోతున్నాయి. సింగిల్ డోసు వేసుకున్న వారి శాతం యుపి, బిహార్‌లలో 40 కంటె తక్కువుంది. అక్కడ వైరస్ విజృంభించిందంటే జననష్టం చాలా వుంటుంది. అసలే వైద్యవసతులు తక్కువ.

ఏదో ఒకటి చేసి టీకాలు వృథా కాకుండా, మురిగిపోకుండా కాపాడాలి. టీకాల డిమాండు తగ్గిపోకుండా చూడాలి. లేకపోతే టీకా కంపెనీలు భవిష్యత్తులో టీకాలు తయారుచేయడం, వాటి గురించి పరిశోధనలకై ఖర్చు పెట్టడం మానేస్తాయి. టీకా వేసుకుంటే బాహుబలి అయిపోతారు లాటి ఉత్ప్రేక్షలు మానేయాలి. సాక్షాత్తూ మోదీ చెప్పినా ప్రజలు నమ్మలేదని, అందుకే టీకాలకై ముందుకు రావటం లేదని గణాంకాలు రుజువు చేశాయి. అందుకని ఇది రోగతీవ్రతను తగ్గిస్తుంది, వీలైతే నిరోధిస్తుంది అని స్పష్టంగా చెప్పి మరీ వేయాలి. వేసుకోకపోతే కరోనా చికిత్సలో ఆసుపత్రి బిల్లులు ఇన్సూరెన్సు కంపెనీ చెల్లించదు అని షరతులు పెట్టాలి. ఇలాటి కారట్ అండ్ స్టిక్ మెథడ్‌ ఉపయోగించైనా సరే టీకాలను వినియోగించాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

[email protected]