ఒక్క ఈల వేయి పవన్.. వైసీపీ మంత్రి కోరిక

పవన్ కల్యాణ్ ఒక్క ఈల వేస్తే చూడాలని ఉందనే కోరికను బయటపెట్టారు మంత్రి పేర్ని నాని. అయితే ఇదేదో ఆయన కోసం ఈల వేయమనడం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ను…

పవన్ కల్యాణ్ ఒక్క ఈల వేస్తే చూడాలని ఉందనే కోరికను బయటపెట్టారు మంత్రి పేర్ని నాని. అయితే ఇదేదో ఆయన కోసం ఈల వేయమనడం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ను ఈల వేయమంటున్నారు.

“మోడీకి, అమిత్ షాకి నేను ఎంత చెబితే అంత అంటుంటారు పవన్. మంగళగిరిలో కూర్చొని పిలిస్తే విమానం వేసుకొని వస్తారు, ఇక్కడ్నుంచి ఈల వేస్తే అక్కడ వాళ్లిద్దరూ పనిచేస్తారు, నేను చీటి  రాసిస్తే కేంద్రంలో వాళ్లు పనిచేస్తారని పవన్ చెబుతుంటారు. మరి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మొద్దని ఒక ఈల వేసి చెప్పొచ్చు కదా. కేంద్రంతో ఏదో మాట్లాడానని అంటున్నారు, అదేంటో బయటకు చెప్పరు. పచ్చిగా దగా చేసే ప్రయత్నం పవన్ కల్యాణ్ ది.”

ఇలా పవన్ కల్యాణ్ పై సెటైర్లతో విరుచుకుపడ్డారు మంత్రి నాని. పవన్ ప్రసంగాలు, ఆయన సభలు కామెడీ సినిమాల్ని తలపిస్తాన్న మంత్రి.. పవన్ మాటలు, చేష్టలు చూసి కార్మికులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

“ఇదో పెద్ద కామెడీ సినిమా. ఉక్కు ఫ్యాక్టరీ ముందు పవన్ ది ఒక సినిమా అయిపోయింది, మొన్న మంగళగిరిలో మరో సినిమా అయిపోయింది. నాలుగు మైకులు పోగేసి జగన్ ను తిట్టడం తప్ప పవన్ చేసిందేంటి? రోజూ డిజిటల్ మీడియాలో అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు మైకుల ముందు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు కార్మికుల దగ్గరకు వెళ్లండి అసలు సంగతి తెలుస్తుంది. మీ భాష, మీ చేష్టలు చూసి నవ్వుతున్నారు కార్మికులు.”

అమరావతి ఓఆర్ఆర్ కు ఉరి అంటూ ఈనాడు రాసిన బ్యానర్  ఐటెంను తిప్పికొట్టారు మంత్రి. డీపీఆర్ స్టేజ్ లో కూడా లేని అంశాన్ని ఎత్తుకొని, ఏపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాస్తోందని దుయ్యబట్టారు. అసత్య వార్తలు రాయడంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పోటీపడుతున్నాయన్నారు మంత్రి.