విశాఖ మూడక్షరాలు. జగన్ కూడా మూడు అక్షరాలే. అదేమి బంధమో తెలియదు కానీ గత ఏడేళ్ళుగా జగన్ విశాఖ చుట్టూనే ఏపీ రాజకీయం మొత్తం తిరుగుతోంది. మరీ ముఖ్యంగా గత రెండేళ్ళుగా చూసుకుంటే విశాఖ రాజధానిని ప్రకటించిన మీదట జగన్ నామస్మరణతో వైసీపీ శ్రేణులే కాదు, సగటు జనాలు తరిస్తున్నారు.
విశాఖకు జగన్ మాత్రమే ఏమైనా చేయగలరు అన్న మాట అయితే సాదా సీదా జనంలో గట్టిగానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికి ముమ్మారు సీఎం అయినా కూడా విశాఖకు వెలుగులు తేలేకపోయారు. ఇక జగన్ వస్తూనే పాలనా రాజధాని వరం ఇచ్చారు. దానికి సాంకేతికపరమైన అడ్డంకులే తప్ప మరేమీ కారణం కాదని, జగన్ అన్న మాటను నెరవేర్చి తీరుతారని మేధావుల నుంచి అంతా ఈ రోజుకీ బలంగా విశ్వసిస్తున్నారు.
ఈ నేపధ్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే సంచలన కామెంట్స్ చేసారు. విశాఖ అభివృద్ధి, భవిష్యత్తు అంతా జగన్ తోనే అంటూ ఆయన మాట్లాడారు, జగన్ తప్ప మరో నేత విశాఖ గురించి ఏ కోశానా ఆలోచించలేరు అని కూడా ఆయన కరాఖండీగా తేల్చేశారు. జగన్ విజన్ తోనే విశాఖ ప్రగతి బాటను పడుతుందని, జనం కూడా అదే కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
కేవలం పాలనారాజధాని అని ప్రకటించి ఊరుకోకుండా అన్ని రంగాల్లో కూడా విశాఖను అభివృద్ధి బాటన నడిపించడం జగన్ టార్గెట్ అని కూడా అవంతి చెప్పారు. విశాఖ గురించి అందరి కంటే ఎక్కువగా ఆలోచించేది కూడా జగనే అని తేల్చేశారు. మొత్తానికి జగన్ విశాఖను ఏదో రోజున రాజధానిగా ప్రకటిస్తారు అని మంత్రి ధీమాగా చెబుతున్నారు.
మూడు రాజధానులకు మద్దతు అంతకంతకు పెరుగుతున్న వేళ, విశాఖ కోసం ఏయూ ప్రొఫెసర్లతో పాటు మేధావులు కదులుతున్న వేళ మంత్రి అవంతి చేసిన కీలకమైన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి.