టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేసుకునే నిర్మాతలున్నాయి. ఇలా అంతా బాగున్నప్పటికీ సమంత మాత్రం 'కొంతవరకు' మాత్రమే పరిమితమైపోయింది. స్టార్ హీరోల సినిమాల్ని కాదని, తనే లీడ్ రోల్ గా సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఈ ఆలోచన కరెక్ట్ కాదంటున్నారు చాలామంది.
స్టార్ హీరోల సినిమాలకు ఉన్నంత క్రేజ్, స్టార్ హీరోయిన్లు లీడ్ రోల్ చేసే సినిమాలకు ఉండవు. ఎంత కష్టపడినా, ఎంత గట్టిగా ప్రచారం చేసినా, ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు ఎప్పుడూ పరిమితులు ఉంటూనే ఉంటాయి. అలాంటి సెగ్మెంట్ లోకి ఎంటరైన సమంత, తన మార్కెట్ ను, క్రేజ్ ను తానే తగ్గించుకుంటోందని ఫీల్ అవుతున్నారు ఆమె అభిమానులు.
విజయశాంతి మోడల్ ఫాలో అవ్వాలి..
ఈ సందర్భంగా విజయశాంతి కెరీర్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. లేడీ అమితాబ్ అనే పేరు తెచ్చుకుంది విజయశాంతి. ఎన్నో యాక్షన్ సినిమాలతో హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆమె సడెన్ గా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు షిఫ్ట్ అయిపోలేదు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తనే లీడ్ రోల్ పోషిస్తూ సినిమాలు చేసింది. క్రమక్రమంగా తనకిష్టమైన సెగ్మెంట్ వైపు మళ్లింది.
సమంత కూడా ఇదే విధానం ఫాలో అయితే బాగుంటుంది. ఒకేసారి కమర్షియల్ సినిమాల్ని ఆమె పక్కనపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు చాలామంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తనకిష్టమైన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తే బాగుంటుందంటున్నారు. ఇలా చేయడం వల్ల సమంత క్రేజ్ మరింత పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు.
స్టార్ హీరోయిన్ కొరత వేధిస్తోంది..
ఈ మొత్తం డిస్కషన్.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మొదలైంది. ఈ సినిమా కోసం పూజాహెగ్డేను ప్రయత్నించారు. ఆమె కాల్షీట్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య శ్రీలీలను తీసుకున్నారనేది వాస్తవం. అదే సమయంలో సమంత రేసులో ఉంటే కచ్చితంగా పవన్-సమంత కాంబో లాక్ అయి ఉండేదని, అత్తారింటికి దారేది మేజిక్ రిపీట్ అయి ఉండేదని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు. అది నిజం కూడా.
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల కొరత వేధిస్తోంది. నిజంగా సమంత కమర్షియల్ ఫార్మాట్ లోనే కొనసాగి ఉంటే ఈపాటికే ఆమె మరోసారి మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఉండేది. అలా చేయకపోవడం వల్ల కెరీర్ ను లిమిట్ చేసుకుందనేది ఆమె అభిమానుల ఆవేదన.
ఇప్పటికైనా సమంత తన మైండ్ సెట్ మార్చుకోవాలంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఓవైపు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ మూవీస్ చేయాలంటున్నారు.