మహాసముద్రంతో మహా డిజాస్టర్ అందుకున్న అజయ్ భూపతి, ఎట్టకేలకు మరో మూవీతో రెడీ అవుతున్నాడు. ఆయన కొత్త సినిమా పేరు మంగళవారం. ఈరోజు ఆ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. 'మంగళవారం' ముచ్చట్లను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు.
ఓ అందమైన అమ్మాయి సీతాకోకచిలుక డ్రెస్ లో, డాన్సింగ్ పోజులో నిల్చొని ఉంది. రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు ఆత్రుతగా చూస్తోంది. ఆమె సీతాకోక చిలుక డ్రెస్ నిండా మనిషి కళ్లు ఉన్నాయి. వాటి నుంచి రక్తం కారుతోంది. ఇలా ఇంట్రెస్టింగ్ గా 'మంగళవారం' పోస్టర్ ను క్రియేట్ చేశాడు అజయ్ భూపతి.
ఈ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారాడు. ముద్ర మీడియా వర్క్స్ తో కలిసి, ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటివరకు ఇండియాలో ఎవ్వరూ ట్రై చేయని కొత్త జానర్ గా మంగళవారం సినిమాను చెప్పుకొస్తున్నాడు దర్శకుడు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 30 మంది ఆర్టిస్టులు నటిస్తున్నారట. ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంటుందంటున్నాడు భూపతి. ఆర్టిస్టులు ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు. కాంతార ఫేమ్ అజనీష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.