ఓ ప్రాజెక్టులో త్రివిక్రమ్ ఉన్నాడంటే పూర్తిగా అతడి డామినేషన్ కనిపిస్తుంది. దర్శకుడిగానే కాదు, కనీసం స్క్రీన్ ప్లే-మాటల రచయితగా ఉన్నప్పటికీ, మరో దర్శకుడ్ని డామినేట్ చేస్తాడు త్రివిక్రమ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భీమ్లానాయక్.
భీమ్లానాయక్ సినిమా పేరు చెప్పగానే పవన్ కల్యాణ్ తర్వాత, త్రివిక్రమ్ మాత్రమే గుర్తొస్తాడు. కానీ ఆ సినిమాకు అతడు దర్శకుడు కాదు. కేవలం కథలో మార్పులు, డైలాగ్స్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆన్-లొకేషన్ స్టిల్స్ నుంచి త్రివిక్రమ్ డామినేషన్ కనిపిస్తుంది.
ఇక తీన్ మార్ సినిమా టైమ్ లో కూడా త్రివిక్రమ్ హవానే నడిచింది. ఆ సినిమాకు కూడా అతడు దర్శకుడు కాదు. ఇక ఛల్ మోహనరంగ సినిమా సంగతి సరే సరి. ఆ మూవీలో అడుగడుగునా త్రివిక్రమ్ కనిపిస్తాడు, కానీ అతడు దర్శకుడు కాదు.
ఇలా తను డైరక్ట్ చేయకపోయినా, తన మార్క్ ఉండేలా, తనకు క్రెడిట్ దక్కేలా త్రివిక్రమ్ వ్యవహరిస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో ఉంది. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా విషయానికొస్తే, అది జరిగేలా కనిపించడం లేదు. అదే వినోదాయ శితం రీమేక్.
సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోంది వినోదాయశితం రీమేక్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమా మూలకథ సముద్రఖని. రీమేక్ కు వచ్చేసరికి త్రివిక్రమ్ దానికి మార్పుచేర్పులు చేశారు, డైలాగ్స్ కూడా రాసిచ్చారు. అయితే సెట్స్ పై త్రివిక్రమ్ తన హవా చూపించగలడా అనేది అందరి ప్రశ్న.
ఎందుకంటే అక్కడున్నది దర్శకుడు సముద్రఖని. ఈ సీనియర్ మోస్ట్ డైరక్టర్ ను కాదని, సెట్స్ లో హడావిడి చేసేంత సీన్ త్రివిక్రమ్ కు ఉండకపోవచ్చు. ఇంతకుముందు సినిమాల్లో త్రివిక్రమ్ కు తను అనుకున్నది జరిగి ఉండొచ్చు. కానీ ఈసారి మాత్రం సముద్రఖని అతడికి అంత అవకాశం ఇవ్వకపోవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దర్శకత్వ పగ్గాలు పూర్తిగా సముద్రఖని చేతిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
అయితే ఇక్కడ కూడా చిన్న అనుమానం ఉంది. ఇది పవన్ కల్యాణ్ సినిమా. ఆయన తలుచుకుంటే, ఏ క్షణంలోనైనా త్రివిక్రమ్ సెట్స్ లో ప్రత్యక్షమౌతాడు. కాకపోతే త్రివిక్రమ్ కూడా ఖాళీగా లేడు. అతడి చేతిలో మహేష్ మూవీ ఉంది. కాబట్టి ఈసారి సముద్రఖని తనపని తాను చేసుకుపోవచ్చు.