ఈ కామెడీ ‘అదిరింద’య్యా నాగబాబూ.!

ఆ మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని విమర్శించేందుకోసం, చింపాంజీ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టారు నాగబాబు. ఒకానొక సందర్భంలో మూడు రాజధానుల వ్యవహారంపై కుక్క బొక్క కూడా పోస్ట్‌…

ఆ మధ్య వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిని విమర్శించేందుకోసం, చింపాంజీ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టారు నాగబాబు. ఒకానొక సందర్భంలో మూడు రాజధానుల వ్యవహారంపై కుక్క బొక్క కూడా పోస్ట్‌ చేశారు జనసేన నేత నాగబాబు. కానీ, అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి ఇచ్చిన ఝలక్‌తో నాగబాబు ఎంచక్కా తన సోషల్‌ మీడియా హ్యాండిల్‌ని, కామెడీ షోలకి పరిమితం చేసేస్తున్నారు.

'ఎవరేమనుకున్నా, అంతా నా ఇష్టం..' అనుకుంటున్న నాగబాబు, ఆఖరికి జనసైనికుల ప్రశ్నలకూ సమాధానమివ్వడంలేదు '3 రాజధానులపై' చిరంజీవి విడుదల చేసిన ప్రెస్‌ నోట్స్‌కి సంబంధించి. 'జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌కీ అదిరింది ప్రోగ్రామ్‌కీ తేడా ఇదీ..' అంటూ ఈ మధ్యనే ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు, 'మీతో పోటీ వద్దనుకున్నాం.. అడిగారుగా.. గట్టి పోటీ ఇస్తాం..' అంటూ తాను చేస్తోన్న 'అదిరింది' కామెడీ షో గురించిన ఇంకో వీడియో విడుదల చేశారాయన.

ఇంకేముంది, జనసైనికులు ఒకింత గట్టిగానే నాగబాబు మీద సెటైర్లు వేస్తున్నారు.. కడిగి పారేస్తున్నారు. చిరంజీవి ప్రెస్‌ నోట్స్‌ మీద స్పందించకుండా, టైమ్‌ పాస్‌ వ్యవహారాలేంటి.? అని కొందరు నిలదీస్తున్నారు. 'జనసేన పార్టీలోకి మీరు వచ్చాకే పతనం ప్రారంభమయ్యింది..' అంటూ కొందరు పవన్‌ అభిమానులు, నాగబాబుని ప్రశ్నిస్తుండడం గమనార్హం.

నాగబాబు, ఇటీవలి ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. అన్నట్టు, అమరావతిలో రైతులకు అండగా వుంటాం.. వారిని ఢిల్లీకి తీసుకెళతాం.. అని ప్రకటనలు చేసిన నాగబాబు, ఆ తర్వాత ఆ వ్యవహారంపై పెదవి విప్పకపోవడం.. పైగా 'అదిరింది' ప్రమోషన్లలో మునిగిపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.?