నిజంగా చినబాబును మెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. జీవితంలో తొలిసారి ఆయన తెలివైన నిర్ణయం తీసుకున్నారు లోకేష్. పొలిటికల్ గా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అవును.. అమరావతి వద్ద ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు లోకేష్. ఈ విషయంపై ఆయన ట్విట్టర్ లో ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు.
అవకాశం దొరికితే చాలు జగన్ పై ట్వీట్లు పెట్టడానికి ఎప్పుడూ ముందుంటారు లోకేష్. ఏదీ లేకపోతే ఏదో ఒకటి కల్పించి మరీ జగన్ పై ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి చినబాబుకు, అమరావతిలో రైతుల ఆందోళన ఆయాచిత వరమనే చెప్పాలి. కానీ లోకేష్ మౌనమునిలా మారాడు. దీనికి కారణం రాయలసీమ, ఉత్తరాంధ్రలో బ్యాడ్ అయిపోతామని గ్రహించడమే.
అమరావతిలో రైతులు చేస్తున్న ఆందోళనకు లోకేష్ మద్దతిస్తే, పరోక్షంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటును ఆయన వ్యతిరేకించినట్టే. అదే కనుక జరిగితే ఆ రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది. అందుకే వ్యూహాత్మకంగా చినబాబు తప్పుకున్నారు. ఓవైపు తన సొంత మీడియా దీనిపై గగ్గోలు పెడుతున్నప్పటికీ, తను మాత్రం చూసీచూనట్టు వ్యవహరిస్తున్నారు.
ఈరోజు పెట్టిన ట్వీట్ లో కూడా లోకేష్ చాలా జాగ్రత్త పడ్డారు. అన్నదాతలందరికీ జాతీయ రైతుదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన లోకేష్.. ప్రతి రైతు సమస్యపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందంటూ ఓ డైలాగ్ మాత్రం పెట్టి ఊరుకున్నారు. అమరావతి రాజధాని, రైతుల భూములు లాంటి అంశాల్ని టచ్ చేయలేదు.
దాదాపు వారం రోజులుగా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు చినబాబు. ఓ ఊరిలో ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా, చూశారా వైసీపీ కార్యకర్తల వీరంగం అంటూ రెచ్చిపోయేవారు లోకేష్. ఎక్కడ ఏ చిన్న హత్య జరిగినా, చివరికి అది సహజ మరణమైనా కూడా లోకేష్ చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు అమరావతి రైతుల ఆందోళన విషయంలో మౌనంగా ఉన్నారంటే, అది కచ్చితంగా వ్యూహాత్మకమే.
మంగళగిరిని మందళగిరి అని ఉచ్ఛరించినా తప్పులేదు. జయంతిని వర్థంతిని చేసినా సర్దిచెప్పుకోవచ్చు. కానీ అమరావతి రైతుల విషయంలో రియాక్ట్ అయితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టీడీపీ భూస్థాపితం అవ్వడం ఖాయం. అందుకే చంద్రబాబే ఇలా ముందుజాగ్రత్తగా లోకేష్ ట్విట్టర్ కు తాళం వేసి ఉంటారు.