చంధ్రబాబుకు మళ్లీ సమస్య వచ్చి పడింది. అదే రెండు కళ్ల సమస్య. ఆయనకు అవ్వా కావాలి, బువ్వా కావాలి.తెగేసి చెప్పలేరు ఏదీ కూడా. తెలంగాణ విషయంలో ఆయన పదే పదే రెండు కళ్ల సిద్దాంతాన్ని ప్రవచించారు. ఆఖరికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఆంధ్ర కంటిలో పొడిచారు. చంద్రబాబు ఎప్పటికీ జగన్ మాదిరి కాదు. చావో, రేవో? ఒకవైపు ఫిక్స్ కావడం అన్నది జగన్ స్టయిల్.
లేటెస్ట్ సంగతేమిటంటే ముఖ్యమంత్రి జగన్ విశాఖను ఆడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు.అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా వుంచుతారు. ఇది చంధ్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. కానీ ఆ మాట స్పష్టంగా చెప్పలేరు. ఎందుకంటే అలా చేస్తే, ఉత్తరాంధ్ర మూడుజిల్లాలు, ఈస్ట్, వెస్ట్ జనాల మనోభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అవుతుంది.
అలా అని జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా వుండలేరు. అలా చేస్తే తనను నమ్మి అమరావతిలో కోట్లకు కోట్లు పెట్టుబడిపెట్టిన తమ వర్గ జనాలు నిరాశ పడతారు. జనాల్లో అలజడి రేకెత్తించాలి. ఉద్యమదిశగా నడిపించాలి. అదే టైమ్ లో విశాఖ ప్రాంత జనాలు తనను తప్పు పట్టకూడదు.
అందుకే బాబుగారు మళ్లీ తన రెండు కళ్ల సిద్దాంతాన్ని బయటకు తీసారు. విశాఖ అంటే తనకు ఇష్టమే అని కానీ అమరావతి మాత్రమే క్యాపిటల్ గా వుండాలని అంటున్నారు. రాజధాని నిర్ణయం ఆయన చేతుల్లో వున్నపుడే విశాఖను కాదని, అమరావతిని ఎంచుకున్నారు. మరి అలాంటి నేపథ్యంలో బాబుగారికి విశాఖ అంటే ఇష్టమని ఆ ప్రాంత వాసులు ఎలా అనుకుంటారు? అప్పుడు ఆయన చేయలేదు సరే, ఇప్పుడు జగన్ చేస్తుంటే, వ్యతిరేకిస్తున్నారు. మరి ఇప్పుడు మాత్రం విశాఖ అంటే ఇష్టం అని చెబితే ఎలా నమ్ముతారు?
అందువల్ల బాబుగారి రెండు కళ్ల సిద్దాంతం ఇప్పుడు మరోసారి బయటకు తీసినా అంత ఫలితం వుండకపోవచ్చు.