రాజు చిన్నభార్య మంచిదంటే…దానర్థం పెద్ద భార్య మంచిది కాదనే కదా! రాజధాని అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఆరు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వారికి పలు సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి సంఘీభావంగా సోమవారం తుళ్లూరులో పర్యటించాడు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశాడు. రాజధాని రైతులు కూడా చంద్రబాబుతో గొంతు కలిపి ‘జైజై అమరావతి’ అని నినదించారు. రైతులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి మహానగరం అవుతుందని భావించానన్నారు. అసెంబ్లీ, హైకోర్టు ఉంటే అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని చంపేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి జరుగుతుందని, ఆధునిక నగరం వస్తుందంటూ అమరావతిని ప్రపంచమంతా పొగిడిందని ఆయన తెలిపారు.
వైఎస్ జగన్ సర్కార్ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూల్‌ను న్యాయ సంబంధ రాజధానిగా చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. వారినుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు ఉంటే అభివృద్ధి జరగదన్నారు. అన్నీ అమరావతిలో ఉంటే తప్ప అభివృద్ధి జరగదని చెబుతున్న చంద్రబాబు…ఏ ఒక్కటీ నోచుకోని రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల గతి ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి మాత్రమేనా? రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అమరావతి మినహా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటో కూడా చంద్రబాబే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కడుతున్నట్యాక్స్ సొమ్ముతో ఒక్క అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దితే మిగిలిన ప్రాంతాలు, నగరాలు, పట్టణాల ప్రజలు బతికేదెలా?
‘జై అమరావతి’ అని బాబు ఇస్తున్న నినాదంలో దాగిన విధానం ఏమిటి? ‘జై అమరావతి’ అంటే నై విశాఖ, నైనై కర్నూల్ అని అర్థం చేసుకోవాలా? అంటే చంద్రబాబు విశాఖ, కర్నూల్ ప్రాంతాలను రాజధానులగా చేయడాన్ని వద్దేవద్దని చెబుతున్నారని ఆయన నినాదాన్ని అర్థం చేసుకోవాలా? మరి ఆ ప్రాంతాలను పట్టించుకోని మిమ్మల్ను, ఆ ప్రాంతాల వారు మాత్రం ఎందుకు దగ్గరికి తీసుకుంటారు బాబు? మిమ్మల్ని కూడా ‘గోబ్యాక్’ బాబు అని నినదించే రోజు ఎంతో దూరంలో లేదు.