అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఎగిరెగిరి పడుతున్నాడు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజల, రైతుల ఆవేదన, ఆక్రంధనలకు అక్షర రూపం ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టారు. కానీ 29 గ్రామాల రైతుల ఆందోళనతో జగన్ సర్కార్ కూలిపోయేలా ఉందని, కేంద్రం రాష్ట్రపతి పాలన విధించేలా ఉందనే రీతిలో ప్రతిరోజూ ఆంధ్రజ్యోతిలో రాతలు రాస్తున్న వారికి ఎలా ఉందో కానీ, చదువుతుంటే మాత్రం అసహ్యం వేస్తోంది.
1995, ఆగస్టు సంక్షోభంలో ఆంధ్రజ్యోతి కరస్పాండెంట్‌గా రాధాకృష్ణ లేనిది ఉన్నట్టు రాసి చంద్రబాబుకు మేలు చేశారనే ప్రచారం ఉంది. ఎన్టీఆర్‌ను విభేదించి చంద్రబాబు కొంత మంది ఎమ్మెల్యేలతో వైశ్రాయ్ హోటల్‌లో శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇంతగా మీడియా వ్యవస్థ బలంగా లేదు. ఎలక్ట్రానిక్ మీడియా అసలే లేదు. పత్రికల్లో వచ్చే వార్తల వల్లే ఏం జరుగుతున్నదో తెలుసుకోవాల్సి వచ్చేది.
చంద్రబాబు శిబిరంలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే 50 మంది ఉన్నారంటూ ఐదింతలు ఎక్కువగా రాధాకృష్ణ రాసి బాబుకు లబ్ధి చేశారని పత్రికా, రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం ఉంది. ఇలాంటి రాతల వల్లే ఎన్టీఆర్ శిబిరంలో ఉన్న వాళ్లలో ఒక్కొక్కరుగా జారుకుని బాబు చెంతకు చేరారని నాటి సంగతులను కథలు కథలుగా చెబుతుంటారు. ఆర్‌కేను ఆంధ్రజ్యోతి ఎండీ చేసి బాబు తన “రుణాన్ని” తీర్చుకున్నారనే వాదన ఉంది.
ప్రస్తుత విషయానికి వస్తే రాజధానిపై ఏం జరుగుతోందంటూ ప్రధాని కార్యాలయం ఆరా తీస్తోందని ఆంధ్రజ్యోతి ఓ వార్తా వంటకం వండింది. “ఏం జరుగుతోంది?” శీర్షికతో రాసిన కథనంలో రాజధాని మహిళలు, రైతులు, చిన్నారుల ఆందోళనలు ప్రధాని కార్యాలయాన్ని కదిలించాయని, ఏం జరుగుతోందంటూ కేంద్ర నిఘా విభాగం (ఐబీ) నివేదికలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవిక రిపోర్టును తెప్పించుకుంటోందని ఓ కట్టు కథను ఆర్‌కే అల్లాడు.
మీ సీఎం నిర్ణయం సరైందని భావిస్తున్నారా? అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా ఉంటుంది? పరిపాలనా వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరుగుతన్నదని ప్రజలు భావిస్తున్నారా? తదితర అంశాలపై 24 మంది అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించినట్టు “ఆంధ్రజ్యోతి”కి ప్రత్యేకంగా తెలిసిందని రాసుకొచ్చారు. కేంద్ర నిఘా బృందాలు కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రంగంలోకి దిగాయని ఆర్‌కే మార్క్ వార్తను వండివార్చాడు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తించుకోవాల్సిన అంశాలు ఏంటంటే….ఇది 1995 నాటి కాలం కాదు. మోసపోవడానికి పాలనలో ఎన్టీఆర్ లేడు. సీఎంగా జగన్ పాలన సాగిస్తున్నాడు. ఎన్టీఆర్‌లా జగన్ అమాయకుడు కాదు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతా ఆందోళనలతో అట్టుడికి పోతోంది. మోడీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయో, 20 మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారో తెలుసుకునేందుకు కేంద్ర నిఘా బృందాలు తలమునకలై ఉన్నాయనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు.
ఏం జరుగుతోంది? అని ఆంధ్రజ్యోతిలో రాయగానే జగన్ భయపడి తన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. ఇంకా ఎంత కాలం స్వామి అక్షరమే ఆయుధం అని చెబుతూ అక్షరాన్ని ఆదాయంగా మలుచుకుంటావ్? ఇక చాలు…నీ రాతలను, మాటలను నమ్మి మోసపోయే జనరేషన్ లేదిక్కడ?