జార్ఖండ్ ఫలితాలు పూర్తిగా వెలువడలేదు కానీ ఆ రాష్ట్రం బిజెపి చేతిలోంచి జారిపోయిందనేది నిశ్చయమై పోయింది. ఇది రాసే సమయానికి బిజెపికి 12 తగ్గి 25 వస్తే జెఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా)కు 30, దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసుకు 16, ఆర్జెడికి 1 వచ్చాయి. 81 సీట్ల అసెంబ్లీలో జెఎంఎం కూటమికి 47 వచ్చాయి కాబట్టి ఎవర్ని పిలవాలన్న సందిగ్ధం గవర్నరుకి లేదు.
'కాంగ్రెసు ముక్త్ భారత్'ను సాధిద్దామనుకున్న బిజెపి కల దూరమౌతూ పోతోంది. ఈ జార్ఖండ్ ప్రభుత్వంలో కాంగ్రెసు భాగస్వామి కాబోతోంది. గత ఏడాదిలో జరిగిన ఎన్నికలలో ఐదిటిలో బిజెపి అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఇప్పుడీ జార్ఖండ్. హరియాణాలో సొంత ప్రభుత్వానికి బదులుగా సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఎన్నికలలో ఓడిపోయినా ఫిరాయింపులతో కర్ణాటకలో అధికారం సంపాదించుకుంది.
ఎగ్జిట్ పోల్స్‌లో కొన్ని ప్రస్తుత ఫలితాలను ఊహించగలిగినా (వాళ్లు చాలా పెద్ద రేంజి పెట్టుకుని చెప్పారు) చాలామంది జార్ఖండ్‌లో హంగ్ అసెంబ్లీ వస్తుందనే అన్నారు. హంగ్ అనగానే అమిత్ ఏదో ఒకటి చేసేసి, బిజెపి ప్రభుత్వాన్ని తెచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ జార్ఖండ్ ప్రజలు ఆయనకు గుఱ్ఱాల వ్యాపారం (హార్స్ ట్రేడింగ్) చేసే బాధ తప్పించారు.
కౌంటింగ్ మొదలై ఒక రౌండు కాగానే కూటమి, బిజెపి బలాబలాలు సమానంగా వస్తున్నాయని తెలియగానే యిరుపక్షాలూ జెవిఎం (పి) నేత బాబూలాల్ మరాండీకి ఫోన్లు చేసేశారు. ఆ పార్టీకి 5 వస్తున్నాయని అనుకున్నారు. చివరకు 3 వచ్చాయి. ఫలితాలు స్పష్టంగా రావడంతో యిక ఆ ఫోన్లు ఆపేశారు.
ఎన్నార్సీ (పౌరసత్వ జాబితా)ని వ్యతిరేకించే వర్గాలు, జార్ఖండ్ తీర్పు బిజెపి విధానానికి చెంపపెట్టని అంటున్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సి ఏమిటంటే ఎన్నార్సీపై వెనకడుగు మోదీ నిన్ననే వేసేశారు. అందువలన దానికి, జార్ఖండ్ తీర్పుకి సంబంధం లేదనుకోవాలి. స్థానిక సమస్యలే ప్రధానంగా తెరపైకి వచ్చాయిట. జర్నలిస్టులు పౌరులను పౌరసత్వ జాబితా, రామమందిరం, ఉమ్మడి కోడ్, కశ్మీర్ వంటి విషయాలపై వారి అభిప్రాయాలు అడిగితే వాళ్లు చికాకు పడ్డారట. వాటికీ మాకూ ఏం సంబంధం? మాకు యిక్కడ అందాల్సినవి అందక ఛస్తూంటే వాటి గురించి మాట్లాడతారేమిటి అని అడిగారట. ఇది బిజెపి నాయకులకు కూడా తట్టలేదు. వాళ్లు గతంలో గ్యాస్ సిలిండరు యివ్వడం, మరుగుదొడ్లు కట్టించడం గురించి మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈసారి అవేమీ మాట్లాడలేదు. అన్నీ జాతీయ విషయాలే!
జార్ఖండ్‌లో కేంద్ర సంక్షేమ పథకాలు ఏవీ సవ్యంగా అమలు కాకపోవడంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి బిజెపి కేంద్ర నాయకులు వచ్చి ఆర్టికల్ 370, అయోధ్య, సిఎఎ,.. వీటిపై మాట్లాడి 'చూడండి మీకెంత చేసేస్తున్నామో' అని యింప్రెస్ చేయబోయారు. ఏడు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పాకిస్తాన్‌పై దాడుల గురించే మాట్లాడి 14 సీట్లలో 12 గెలుచుకున్నాం కదా, అదే ట్రిక్ మళ్లీ ప్లే చేద్దాం అనుకున్నారు. ఆ ఎన్నికలలో బిజెపికి 11, దాని భాగస్వామి ఎజెఎస్‌యు (ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్)కు 1 వచ్చాయి. వారికి ప్రత్యర్థి కూటమిలో ఉన్న జెఎంఎంకు 1, కాంగ్రెసుకు 1 వచ్చాయి. అయితే మే నుంచి డిసెంబరు లోపున ప్రజల ఆర్థిక స్థితి అధ్వాన్నమై పోవడంతో ఆ కోపం ఎలాగూ ఉంది. దాంతో మోదీగారు మోదీ 6 సార్లు వచ్చి 9 బహిరంగ సభల్లో పాల్గొన్నా, అమిత్ 11 సభల్లో పాల్గొని జాతీయ విషయాలపై ఉద్ఘాటించినా జనం పట్టించుకోలేదు.
ప్రతిపక్షాలు స్థానిక సమస్యల మీదే మాట్లాడాయి. అది ఓటర్ల తలకు బాగా ఎక్కింది. బిజెపి 2014 అసెంబ్లీ ఎన్నికలలో పాత ముఖ్యమంత్రులు చేసిన అవినీతిపై లెక్చర్లు దంచి, 5 సీట్ల ఎజెఎస్‌యు భాగస్వామిగా 42 సీట్లతో ప్రభుత్వం ఏర్పరచింది. ఆ తర్వాత రెండు నెలలకు 8 సీట్ల జెవిఎం(పి) నుంచి 6గుర్ని ఫిరాయింపుదారులను చేర్చుకుని యిమేజి పోగొట్టుకుంది. ఆ తర్వాతి రోజుల్లో కేసుల్లో యిరుక్కుని, చార్జిషీట్లు అందుకున్న వారిని కూడా తన పార్టీలో చేర్చుకుని టిక్కెట్లిచ్చింది. మోదీ వచ్చి వాళ్ల తరఫున ప్రచారం కూడా చేశాడు. ఇక దానితో ఎదుటి వారి అవినీతి గురించి బిజెపి చెప్పే మాటలకు విలువ పోయింది. పైగా సరయూ రాయ్ అనే విజిల్ బ్లోయర్ – సొంతంగా కృషి చేసి అక్రమాలను బయటపెట్టి ప్రజలను అప్రమత్తం చేసే పారా హుషారీ కి అమిత్ టిక్కెట్టు యివ్వకపోవడం బిజెపి బండారాన్ని బయటపెట్టింది.
సరయూ రాయ్ బిజెపియేతర గత ప్రభుత్వాల అవినీతిని బయటపెట్టి, ప్రజలను బిజెపికి మళ్లించి పార్టీకి ఎంతో సాయపడ్డాడు. అతనికి పార్టీ టిక్కెట్టు యివ్వాలని ఎందరు చెప్పినా అమిత్ పట్టించుకోలేదు. దాంతో అతను స్వతంత్రుడిగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిలబడి అతన్ని ఓడించేశాడు. ఇలాటి రాజకీయ తప్పిదాలు చాలానే జరిగాయి. పార్లమెంటు ఎన్నికల వరకు ఎజెఎస్‌యుతో ఉన్న పొత్తును అమిత్ తెంపేశాడు. దాంతో వాళ్లు, జెవిఎం(పి) వాళ్లు బిజెపి ఓట్లకు గండి కొట్టారు. మామూలుగా ఝార్ఖండ్ చిన్న రాష్ట్రం కాబట్టి రాజకీయ అనిశ్చితి ఎక్కువ. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లు పూర్తి చేసుకోదు. రఘువర్ దాస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వాన్ని నడిపింది కాబట్టి, అందరూ మురిసి ముక్కలవుతారని, యీసారి సొంతంగా 50కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేసి ఒంటరిగా పోటీ చేయించాడు అమిత్.
గతంలో దేశవ్యాప్తంగా గిరిజనులు కాంగ్రెసుకి ఓటేసేవారు. కానీ గత పదేళ్లగా ఆరెస్సెస్ గిరిజన ప్రాంతాల్లో పని చేస్తూ విద్య, వైద్య సౌకర్యాలు అందించి, వారిని బిజెపి వైపుకి మళ్లించింది. అందుకని ఏ రాష్ట్రంలోనైనా సరే, గిరిజన ప్రాంతాల్లో బిజెపి గెలుస్తోంది. అలాటిది గిరిజనులు ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ఓడిపోవడం షాక్ యిచ్చింది. ఇప్పుడు యిది! దీనికి కారణం కొత్త రాజకీయ సమీకరణాలతో బిజెపి చేస్తున్న ప్రయోగాలు. జాట్లు ఎక్కువగా ఉన్న హరియాణాలో జాటేతరుణ్ని, మరాఠాల ప్రాబల్యం బాగా ఉన్న మహారాష్ట్రలో బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రిని చేసినట్లే, జనాభాలో 26% గిరిజనులున్న ఝార్ఖండ్‌లో గిరిజనేతరుడైన రఘువర్ దాస్‌ని ముఖ్యమంత్రిని చేసింది. పంజాబీని హరియాణా ముఖ్యమంత్రి చేసినట్లే, ఛత్తీస్‌గఢ్ వ్యక్తిని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చేసింది.
ఆ విధంగా గిరిజనేతరులందరినీ సంఘటితం చేసిందని సంతోషించిందే కానీ అతని ద్వారా గిరిజన వ్యతిరేక చట్టాలు చేయించ నారంభించింది. తమ భూములకు రక్షణ పోతోందని తెలియగానే గిరిజనులు తిరగబడ్డారు. (దీనిపై దాస్ పనితీరులో లోపాలపై గతంలో 2018 జులైలో ఒక వ్యాసం రాశాను, లింకు చూడండి) పైగా నిత్యావసర వస్తువుల పంపిణీ వారి ప్రాంతాల్లో సరిగ్గా జరగలేదు. బిజెపి గిరిజన వ్యతిరేకి అని భావించారు కాబట్టి గిరిజన ప్రాంతాలలో బిజెపి ఓడిపోయింది. గిరిజన నాయకుడైన బిజెపి మంత్రి అర్జున్ ముండాను ఎన్నికల ప్రచారంలో విస్తారంగా ఉపయోగించక పోవడంలో విజ్ఞత ఏమిటో అమిత్‌కే తెలియాలి. రఘువర దాస్ ప్రభుత్వం రమారమి 10 వేల మందిపై దేశద్రోహం కేసులు మోపడం జనాల్ని మండించింది. ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఝార్ఖండ్‌లో చాలా ఎక్కువ.
కార్పోరేట్ల ద్వారా మీడియాహౌస్లను కైవసం చేసుకుని బిజెపి మీడియాలో తన గురించి గొప్పగా రాయించుకుంటూ, తనే దాని మాయలో పడింది. తాజాగా హరియాణా, మహారాష్ట్రలలో తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుని బోర్లా పడింది. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అదే జరిగింది. తను ఏం చేసినా చెల్లిపోతుందని అనుకుంటే కుదరదని జార్ఖండ్ ఓటరు చెప్పాడు. అంతేకాదు, జాతీయవాదంతోనూ, ముస్లిము బూచిని చూపించే హిందూత్వవాదంతోనూ ఆట్టేకాలం నెగ్గలేవని కూడా చెప్పాడు. ఇప్పటికైనా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి, బడాయి కబుర్లు మాని ఆర్థిక స్థితిని మెరుగుపరచమని హెచ్చరిస్తున్నాడు. పూర్తి గణాంకాలు వచ్చాక మరో వ్యాసం రాస్తాను. అప్పుడు మనకు యింకా స్పష్టమైన చిత్రం గోచరిస్తుంది.
ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2019)
[email protected]