ఫెయిల్యూర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019: పవన్ కల్యాణ్

ఒక వ్యక్తిలో తాను ఎంచుకున్న రంగం పట్ల ఒక అంతఃకరణ శుద్ధితో కూడిన ‘ప్యాషన్’ ఉండాలి. లేకపోతే.. చాలా రకాలుగా ఫెయిల్యూర్స్ తప్పవు. కృతకమైన ప్యాషన్ ప్రదర్శిస్తే గనుక.. అభాసు పాలు కావాల్సి వస్తుంది. లేని…

ఒక వ్యక్తిలో తాను ఎంచుకున్న రంగం పట్ల ఒక అంతఃకరణ శుద్ధితో కూడిన ‘ప్యాషన్’ ఉండాలి. లేకపోతే.. చాలా రకాలుగా ఫెయిల్యూర్స్ తప్పవు. కృతకమైన ప్యాషన్ ప్రదర్శిస్తే గనుక.. అభాసు పాలు కావాల్సి వస్తుంది. లేని జ్ఞానాన్ని ప్రదర్శించే నటనలో అభాసుపాలు కావాల్సి వస్తుంది. ‘ఫెయిల్యూర్ పర్సన్’గా అపకీర్తి మూటకట్టుకోవాల్సి వస్తుంది.

2019లో మన రాజకీయ ప్రముఖులను లెక్కవేస్తే గనుక.. అలాంటి మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అగ్రస్థానంలో నిలుస్తారు. 

గతంలో ఆశలు రేకెత్తించి…
నిజానికి పవన్ కల్యాణ్ గత ఏడాది.. అప్పటి ప్రభుత్వం మీద హఠాత్తుగా ఒక రోజున నిప్పులు చెరగడం ద్వారా.. ప్రజల్లో కొత్త ఆశలకు బీజం వేశారు. చంద్రబాబునాయుడు సాగిస్తున్న దుర్మార్గమైన, ప్రజాహితంతో ఏమాత్రం సంబంధంలేని పరిపాలనను అంతమొందించడానికి మరొక ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ కూడా కనిపించారనడంలో సందేహం లేదు. చంద్రబాబు మీద గానీ, నారా లోకేష్ మీదగానీ, అమిత్ షా మీదగానీ.. గత ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన చేసిన మాటల దాడి ఎవ్వరూ ఊహించనట్టింది. కొన్ని రోజుల పాటూ.. ఆ వేడి పవన్ మాటల్లో కనిపించింది. ఆ తర్వాత.. నెమ్మదిగా అది ఈ సినిమా నటుడు ఆరోజున అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించిన మోనోయాక్షన్ అనే సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు. 

2018 సంవత్సరాంతం నాటికే ఆయన మీద ఆశలు చాలావరకు ఉడిగిపోయాయి. కానీ ఎవ్వరూ బయటపళ్లేదు. ఈ సంవత్సరాంతం నాటికి.. అమిత్ షా లాంటి నాయకుడు అవసరం అనేస్తూ.. తనకు తొలినుంచి అదే అభిప్రాయం ఉన్నదనే వ్యాఖ్యను జోడిస్తూ.. ఆయన భావపతనానికి చివరి వాక్యం కూడా రాసుకున్నారు. 

విమర్శ స్వీకరించలేని అహంకారం..
‘ఫెయిల్యూర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’
గా పవన్ ఈ ఏడాది ప్రస్థానాన్ని మాత్రం గమనిద్దాం. ఏప్రిల్‌లో ఎన్నికలు. సంవత్సరం ఆదినుంచి ఆయన ఎన్నికలకు ఏం ప్రిపేర్ అయ్యారు. వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణంలో ఉన్న లోపాల గురించి తటస్థ వాదులు, పాత్రికేయులు, విమర్శకులు ఎవరు ఏ సందర్భంలో ఎత్తిచూపించినా.. వారందరినీ తన వ్యతిరేకులు కింద జమకట్టి చూడడం.. ఆయన చేసిన మొదటి తప్పు. పార్టీ క్షేత్రస్థాయి నెట్ వర్క్ వీక్ గా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నప్పుడు.. ఆయన ఆ లోపాన్ని దిద్దుకోవడానికి బదులుగా.. ప్రజల ముందు దాన్ని కప్పి పెట్టడానికి విఫలయత్నం చేశారు. ‘నాకు సంస్థాగత నిర్మాణం లేదంటున్నారు.. మీరే నా సంస్థాగత నిర్మాణం.. మీరుంటే నాకు చాలు.. ఇంకేం అక్కర్లేదు..’ అనే పడికట్టు సినిమా డైలాగులను తెచ్చిపెట్టుకున్న అపరిమితమైన ఆవేశంతో… ఊగిపోతూ అనడం ద్వారా.. ఆయన విజిల్స్ కొట్టించుకున్నారు.. జనంతో కేకలు పెట్టించారు, చప్పట్లు కొట్టించుకున్నారు. అంతే తప్ప.. ఇంకేం సాధించలేకపోయారు. విజిల్స్ కొట్టిన వాళ్లంతా ఓటు వేసి ఉన్నా.. కనీసం పవన్ కల్యాణ్ తాను కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారు. 

విమర్శలను ఆమోదించలేని, స్వీకరించలేని అహంకారం పవన్ కల్యాణ్ ను రాజకీయ నాయకుడిగా పూర్తి పతనావస్థకు చేరువ చేసింది. తమాషా ఏంటంటే.. తాను చాలా మంచి, సాత్వికమైన, ఎవరు ఏం చెప్పినా వినే మనిషిని అని ఆయన పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. వాస్తవం ఏంటంటే.. అలాంటి లక్షణం ఉంటే అంతగా చెప్పుకోవాల్సిన అవసరం రాదు. హితులు ఎవ్వరైనా ఒకసారి చెబుతారు.. వినిపించుకునే తీరుని బట్టి.. ఆయనను అర్థం చేసుకుని.. దాన్నిబట్టి మెదలుతారు. ఇప్పుడు ఆయనకు సలహా చెప్పేవాళ్లే లేకపోగా, ఆయనకు తోచినదానికి భజనచేసే వారు మాత్రమే మిగిలినందువల్ల.. ఈ పతనావస్థ తప్పలేదు. 

తడబడిన పొత్తు పొడుపులు…
రాజకీయంగా పొత్తులు కుదుర్చుకోవడంలో పవన్ కల్యాణ్ ఘోరంగా విఫలం అయ్యారు. ఆ విషయంలో ఆయన ప్లే చేసినన్ని డ్రామాలు బహుశా సమకాలీన రాజకీయాల్లో ఎవ్వరూ ప్లేచేసి ఉండరు. మొన్నటిదాకా (ఇవాళకూడా) భాజపాకు చేసిన పవన్, హఠాత్తుగా ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. మానాన్న కూడా కమ్యూనిస్టే వంటి సినిమా డైలాగులేశారు. అదే కమ్యూనిస్టులను ఆఫీసులోనికి రానివ్వకుండా గేటు బయట నించోబెట్టించి.. అవమానించారు. తీరా పొత్తు కుదిరాక.. చెత్త సీట్లను వారికి కేటాయించారు. మళ్లీ చంద్రబాబుతో తన లోపాయికారీ ఒప్పందాలకోసం .. సీట్లను మార్చారు. మంగళగిరిని తొలుత వామపక్షాలకు ఇచ్చి.. అది ఆ పార్టీకి సహజంగా కొంత బలమున్న సీటు గనుక.. లోకేష్ కు దెబ్బ పడుతుందని భయపడి.. ఆ నిర్ణయం రద్దు చేసుకుని.. తిరిగి తన పార్టీ అభ్యర్థినే పెట్టించి నాటకం నడిపారు. అప్పటికీ లోకేష్ ను ఆయన గెలిపించలేకపోయారు. 

కేవలం దళితుల్లో జగన్ కు బలం ఉన్నదనే అభిప్రాయంతో.. ఆ ఓట్లను కొల్లగొట్టడానికి మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. అదొక అద్భుతమైన డ్రామా. ఆ సందర్భంలో ఆమెను ఎంత భజనచేశారో గుర్తుచేసుకుంటే, ఓటమి తర్వాత.. ఇవాళ దాకా అటువైపు తిరిగిచూడని పవన్ అవకాశవాదం అర్థమవుతుంది. ఈ నాటకాలన్నింటినీ చూసి ప్రజలు విసిగిపోయారు. ఆయన చేసే ప్రతి ప్రయత్నమూ జగన్ ను ఓడించడానికి కుట్ర పూరితంగా జరుగుతున్నదే అని తెలుసుకున్నారు. తగినట్లే బుద్ధి చెప్పారు.

సొంత ప్రజలే నమ్మలేదు…
పవన్ ఓటమి పెద్ద ప్రహసనం.. పార్టీ సుదీర్ఘంగా అనేక సీట్లను అధ్యయనం చేసిందని.. వాటన్నింటిలోనూ విజయావకాశాలు మెరుగ్గా ఉన్న రెండింటిని ఫైనల్ వడపోతలో నిగ్గు తేల్చారని.. ప్రకటించి.. ఆయన రెండు చోట్ల బరిలోకి దిగారు. కనీసం రెండు నియోజకవర్గాల్లోని సొంత ప్రజలను కూడా ఆయన నమ్మించలేకపోయారు. రెండుచోట్ల ఓడిపోయినా కూడా ఆయన పాఠం నేర్చుకోలేదు. ప్రజలు తనను ఎంతగా ఛీ కొట్టారో ఆయనకు అర్థం కాలేదు. తన డ్రామాలు ఫలించలేదని తెలుసుకోలేదు. ప్రజలు నమ్మాలంటే చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం అవసరమని ఎరగలేదు.

లోపలా బయటా.. ఇద్దరు మనుషులు
ఆయనకు అంతరంగంలో చంద్రబాబు గెలుపు కావాలి. ఆయన ప్రభుత్వం తన మద్దతుతో ఏర్పడాలి అనే వాంఛ ఉంది. దాని ప్రకారం కుట్రపూరిత రాజకీయాలు చేయడం వలనే ఆయన ఇవాళ ఫెయిల్యూర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా చర్చకు పాత్రమయ్యారు. ఇప్పటికీ ఆయన అదే రెండు రకాల భావజాలాలతో అడ్డదారుల్లో అందలాలు ఎక్కాలని చూస్తున్నారు. భాజపా ప్రాపకం కావాలి. వారు తనని నెత్తిన పెట్టుకోవాలి అని ఆయన కోరిక! కోరికను బయటకు చెప్పరు. మోడీ, షా ల భజన కొత్తగా ప్రారంభించారు. తెలుగు ప్రజలు ఆ భజనను కూడా ఆమోదించే స్థితిలో లేరనే అవగాహన కూడా ఆయనకు లేదు. 

ఎందుకిలా?
ఇలా జరగడానికి ప్రధాన కారణం.. తొలుత చెప్పుకున్నదే. రాజకీయాలు ఆయనకు ప్యాషన్ ఉన్న రంగం కాదు. శ్రద్ధ ఉన్న రంగం కాదు. ఏదో తన క్రేజ్ ను పొలిటికల్ అమ్ముకుని బావుకోవడానికి ఆయన ఇక్కడకు వచ్చారు. ఆ పాచిక పారకపోయేసరికి.. పంతానికి పోయి.. ఇంకా వేళ్లాడుతున్నారు. భాజపా ద్వారా.. అధికారం చెలాయించాలని ఆయన కోరిక. ఇంకో ఏడాదిదాకా ఆయనను భాజపా పట్టించుకోకపోతే గనుక.. ఇప్పటికే సినిమా షూటింగులకు సన్నాహాలు చేసుకుంటున్న పవన్ కల్యాణ్ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతారు. ఇది తథ్యం. తిరిగి మంచి నటుడిగా పేరుతెచ్చుకుంటారు.. అభిమానులందరినీ మరింతగా అలరిస్తారు కూడా..! అది మరింత తథ్యం.

ఇదేపోకడ కొనసాగితే.. ఇప్పుడు ‘ఫెయిల్యూర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా నిలిచిన పవన్ గురించి.. వచ్చే ఏడాదిలో రాజకీయరంగానికి సంబంధించినంత వరకు అసలు సోదిలో పరిగణించాల్సిన అవసరమే ఉండదు.