హిట్ అత్యవసరమైన దశలో ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఒక దశలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన ఈ పంజాబీ భామకు ఇప్పుడు అవకాశాలు మందగించాయి. తమిళ సినిమాల్లో కూడా ఈమె తనవైన ప్రయత్నాలను సాగిస్తూ ఉంది. అయితే అక్కడ కూడా ఈమెకు ప్లాఫులే పలకరించాయి ఈ మధ్యన. ఇక హిందీలో కూడా తన పాత పరిచయాలను ఉపయోగించుకుంటూ రకుల్ ప్రయత్నాలను సాగిస్తూ ఉంది. అయితే అక్కడ కూడా ఈమెకు సరైన హిట్ ఏదీ దక్క లేదు.
అయితే వరస ఫ్లాఫులు ఎదురవుతున్నా రకుల్ కు అవకాశాలు అయితే కలిసి వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్జీకే, మన్మథుడు 2 వంటి సినిమాలు రకుల్ ను నిరాశ పరిచాయి. ఇక బాలీవుడ్ సినిమా ఒకటి విడుదలై అది కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో రకుల్ చేతిలో అయితే సినిమాలున్నాయి. భారతీయుడు 2తో పాటు తమిళంలోనే శివకార్తికేయన్ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది.
వాటితో పాటు ఇప్పుడు రకుల్ కు మరో సినిమాలో ఛాన్స్ దక్కిందట. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు. ఇది వరకూ రకుల్ ఆయనతో నటించింది. దే దే ప్యార్ దే పేరుతో రూపొందిన సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. అందులో అజయ్ తన వయసుకు తగ్గ పాత్రలో, రకుల్ కుర్ర వయసు పాత్రలో కనిపించింది. ఇప్పుడు అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రకుల్ మళ్లీ హీరోయిన్ గా నటించబోతోందట. మరి సీనియర్ హీరోల సినిమాల్లో వరసగా నటిస్తున్న రకుల్ కెరీర్ వాటితో మళ్లీ పుంజుకునేనా?