ముగిసిన రీ-పోస్టుమార్టం.. కేసు కొలిక్కి వచ్చినట్టేనా?

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ కు గురైన నిందితులు నలుగురి మృతదేహాల్ని ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం, మృతదేహాలకు…

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ కు గురైన నిందితులు నలుగురి మృతదేహాల్ని ఎట్టకేలకు కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం, మృతదేహాలకు రీ-పోస్టుమార్టం నిర్వహించింది. గాంధీ హాస్పిటల్ లో ఉదయం ప్రారంభమైన ఈ ప్రాసెస్.. దాదాపు 6 గంటల పాటు సాగింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని బంధువులకు అప్పగించారు. రెండు అంబులెన్సుల్లో నాలుగు మృతదేహాల్ని వాళ్ల స్వగ్రామాలకు చేర్చారు.

పోస్టుమార్టం టైమ్ లో గాంధీ ఆస్పత్రి వైద్యులెవరూ ఎయిమ్స్ వైద్యులను సంప్రదించలేదు. వాళ్లతో మాట్లాడలేదు. కేవలం వాళ్లకు కావాల్సినవి మాత్రమే అందించారు. ముందుగా కొన్ని శరీర భాగాల్ని ఎక్స్ రే తీసుకున్న ఎయిమ్స్ వైద్యులు, తర్వాత బంధువులకు మృతదేహాలు చూపించి, నిర్థారణ చేసుకున్న తర్వాతే పోస్టుమార్టం నిర్వహించారు. అవసరమైన చోట, అప్పటికప్పుడు ఫొటోలు తీసుకొని ప్రింట్ కూడా తీసుకున్నారు. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు కూడా.

ఒక్కో మృతదేహానికి పోస్టుమార్టానికి గంటకు పైగా సమయం తీసుకున్న వైద్యులు.. కావాల్సిన నమూనాలు, ఆధారాలన్నింటినీ సేకరించారు. తర్వాత మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రి సూపరెండెంట్ కు అందజేశారు. అ తర్వాత వాటిని బంధువులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నివేదికతో పాటు వీడియో ఫుటేజ్ మొత్తాన్ని 2 రోజుల్లో హైకోర్టును సమర్పించబోతున్నారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా ఆధ్వర్యంలో ఈ పోస్టుమార్టం ముగిసింది.

పోస్టుమార్టం అనంతరం ఎయిమ్స్ వైద్య బృందం మీడియాతో మాట్లాడ్డానికి నిరాకరించింది. కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా తాము మాట్లాడలేదమని, 2 రోజుల్లో కోర్టుకు పూర్తి నివేదిక ఇస్తామని మాత్రం ప్రకటించారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.