ఎన్నికలు.. అవిగో.. ఇవిగో.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు మూడున్నరేళ్ల నుంచి హడావుడి చేస్తున్నారు. జమిలి ఎన్నికలు అంటూ చెబుతూనే వచ్చారు! చంద్రబాబు చెప్పుకున్న లెక్కల ప్రకారం.. 2022లోనే ఎన్నికలు అయిపోవాల్సిందేమో! 2023 అయిపోతోంది, అసలు ఎన్నికలకే సమయం ఆసన్నం అవుతూ ఉంది.
ఆ సంగతలా ఉంటే… ఒకవేళ ఇప్పటికిప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయిస్తే అప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఏమిటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. లోకేషేమో నాలుగు వేల కిలోమీటర్ల యాత్ర అంటున్నారు!
మరి ఇప్పటికిప్పుడు ఏపీలో అసెంబ్లీని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, రెండు నెలల్లో ఎన్నికలు తీసుకొచ్చిదంటే.. అటు పవన్ కల్యాణ్, ఇటు లోకేష్ ల పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లల్లా తయారవుతుందని వేరే చెప్పనక్కర్లేదు!
పవన్ కల్యాణ్ వైపేమో ఏ మాత్రం ప్రిపరేషన్ లేదు. ఎన్నికలను ఎదుర్కొనడానికి జనసేన ఏ రకంగానూ రెడీగా కనిపించదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం మాట అటుంచితే, ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరినా.. ఆ నియోజకవర్గం, ఈ నియోకవర్గం అంటూ చిటికెల పందిరి వేసుకోవాల్సిందే!
ఇక రెండు నెలల్లో ఎన్నికలు అనే ఊహాగానం వచ్చినా… లోకేష్ తన యాత్రను ఎక్కడ ఆపాలో అర్థం చేసుకోలేని రీతిలో తయారవుతారు! ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడమే కదా ఈ యాత్ర పరమార్థం! మరి అలాంటప్పుడు హఠాత్తుగా ఈ యాత్రను ఆపేస్తే .. ప్రజలు కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నట్టా!
పవన్ కల్యాణ్ ఇంకా వీలైనన్ని రోజులు సినిమాలు, విశ్రాంతితోనే గడిపేలా ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలంటేనే.. కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చు. అది కూడా ఆయన స్టైల్లో కాల్షీట్లు కేటాయిస్తే మాత్రమే! కాబట్టి.. తన పార్టీ భవితవ్యాన్ని చంద్రబాబు చేతిలో పెట్టి పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
ఒకవేళ జగన్ ప్రభుత్వం ముందస్తు.. అంటే మాత్రం పవన్ పరుగులు పెట్టాల్సిందే! అయితే ఊరట ఏమింటే.. ముందస్తు పట్ల జగన్ ప్రభుత్వానికి ఆసక్తి లేనట్టుగా ఉంది. ఎన్నికలు.. ఎన్నికలు అంటూ మూడేళ్ల నుంచి చంద్రబాబు మాట్లాడుతున్నారు కానీ ప్రిపరేషన్ పెద్దగా లేదు. తన పార్టీ శ్రేణులను వెర్రివాళ్లను చేస్తూ చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు తప్ప అంతకు మించి ఆయన మాటలకు విలువేమీ లేదు! జగన్ ప్రభుత్వం ముందస్తు అనే ఆలోచనతో లేనట్టుగా ఉంది కాబట్టి.. పవన్ తీరికగా సినిమాలు చేసుకోవచ్చు, లోకేషుడు రోజుకో పది కిలోమీటర్ల వాకింగ్ చేసుకోవచ్చు!