తిరుపతిలో తలపెట్టిన అమరావతి సభకు తాము రాలేమని అమరావతి జేఏసీకి సీపీఎం ఘాటైన లేఖ రాసింది. ఆ సభకు రాకపోవడానికి గల కారణాలను ఆ లేఖలో వివరించారు. అలాగే అమరావతి జేఏసీ వైఖరి దురదృష్టకరమంటూ సీపీఎం తన వైఖరిని స్పష్టం చేసింది. అమరావతి పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎ.శివారెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఇవాళ లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశం ఏంటో తెలుసుకుందాం.
తమను సభకు పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే తమ నిరసనను వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి అటంకంగా ఉన్న బీజేపీతో వేదిక పంచుకోడానికి తాము సిద్ధం లేమని స్పష్టం చేశారు. ఈ సభకు రాలేనందుకు విచారిస్తున్నట్టు తెలిపారు. పరిపాలన, శాసనరాజధాని అమరావతిలోనే కొనసాగించాలనేది తమ నిశ్చితాభిప్రాయంగా పేర్కొన్నారు.
రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదంటూ కోర్టుకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొందని గుర్తు చేశారు. అంతేకాదు, పార్లమెంట్‌లో అమరావతిని గుర్తించడానికి నిరాకరించిన విషయాన్ని ప్రస్తావించారు. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ఇతరత్రా విషయాల్లో బీజేపీ దగా చేసిందని తెలిపారు.
రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని అమరావతి ఉద్యమ సభలకు, కార్యక్రమాలకు బీజేపీని పిలవాలనే అమరావతి జేఏసీ వైఖరి దురదృష్టకరమని సీపీఎం కార్యదర్శి నిర్మొహమాటంగా విమర్శించారు. బీజేపీని ఆహ్వానించడం వల్లే తిరుపతి సభకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖలో గమ్మత్తైన విషయాన్ని గమనించొచ్చు. పరిపాలన, శాసనరాజధాని అమరావతిలోనే కొనసాగించాలనేది తమ నిశ్చితాభిప్రాయమని స్పష్టం చేసిన సీపీఎం… న్యాయ రాజధాని విషయంలో చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం న్యాయ రాజధాని కూడా అమరావతిలోనే కొనసాగించాలనేది తమ పార్టీ వైఖరిగా సీపీఎం స్పష్టంగా పేర్కొంది. ప్రపంచానికి మాత్రం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను వినిపించడం సీపీఎంకే చెల్లింది. రాయలసీమకు అన్యాయం చేయడంలో వామపక్షాలతో సహా అన్ని పార్టీలు దొందుదొందే అని చెప్పక తప్పదు.