తిరుపతిలో (శనివారం) రేపు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం మార్మోగనుంది. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు సభ జరగనుంది. రాయలసీమకు హైకోర్టు ఇవ్వడంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలను కూడా సమదృష్టితో అభివృద్ధి చేయాలనే నినాదంతో రేపు రాజధానులకు మద్దతు పలుకుతూ తిరుపతి ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులతో భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణను ఆకాంక్షిస్తూ రాయలసీమ మేధావుల ఫోరం తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రజారాజధానుల ఏర్పాటు ఆవశ్యకతపై ఈ సభలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమ నాయకులు తిరుపతికి రానున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణస్వామి, ప్రముఖ రచయిత శాంతినారాయణ, అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యమ నేతలు కూడా ఈ సభకు వస్తున్నట్టు సమాచారం.
ఈ సభలో అభివృద్ధి వికేంద్రీకరణపై రాయలసీమ నడిగడ్డ మీద నుంచి వక్తలు తమ మనోభావాలను వెల్లడించనున్నారు. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ కాదని, ప్రజలతో అవినాభావ సంబంధం ఉండేలా నెలకొల్పాలని డిమాండ్‌తో సభ జరగనుంది. వ్యాపార దృష్టితో నిర్మించే రాజధానుల వల్ల ఏర్పడే అనర్థాలపై చర్చించనున్నారు. రాయలసీమ ఉద్యమంతో దశాబ్దాలుగా మమేకమైన నాయకులు సభకు వస్తుండడంతో అందరి దృష్టి పడింది.