జార్ఖండ్ లో గురి త‌ప్పిన బీజేపీ ‘రామబాణం’!

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ వెనుక‌బ‌డిన వైనం స్ప‌ష్టం అవుతూ ఉంది. ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా ప్ర‌భుత్వం తామే ఏర్పాటు చేస్తామ‌ని కొంత‌మంది క‌మ‌లం పార్టీ నేత‌లు ప్ర‌క‌టించేసుకుంటూ ఉన్నారు!…

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ వెనుక‌బ‌డిన వైనం స్ప‌ష్టం అవుతూ ఉంది. ఫ‌లితాలు ఎలా వ‌చ్చినా ప్ర‌భుత్వం తామే ఏర్పాటు చేస్తామ‌ని కొంత‌మంది క‌మ‌లం పార్టీ నేత‌లు ప్ర‌క‌టించేసుకుంటూ ఉన్నారు! అంటే త‌మ స్థాయి న‌ల‌భై ఐదు సీట్ల నుంచి ముప్పై సీట్ల లోపుకు ప‌డిపోయినా.. తామే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌ల‌మ‌ని బీజేపీ వాళ్లు ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు! త‌మ వైరి ప‌క్షం కూట‌మి మెజారిటీకి చేరువైనా ప్ర‌భుత్వం త‌మ‌దే అని క‌మ‌లం పార్టీ వాళ్లు ప్ర‌క‌టించుకుంటూ ఉన్నారు!

ఇలా ఉంది బీజేపీ వాళ్ల క‌థ‌. ఆ సంగ‌త‌లా ఉంటే.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చాలా అంశాల‌ను వాడుకున్నారు. అందులో ఒక‌టి అయోధ్య రామ‌మందిరం. త‌మ వ‌ల్ల‌నే ఆ వివాదం ప‌రిష్కారం అయ్యింద‌ని మోడీ ప్ర‌క‌టించుకున్నారు. అయోధ్య రామ మందిర వివాదం గురించి సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం తొమ్మిదేళ్ల పాటు విచారించి చివ‌ర‌కు ఒక తీర్పును ఇచ్చింది.

అయితే ఆ తీర్పును కూడా మోడీ త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకున్నారు, సుప్రీం కోర్టు తీర్పును అలా బీజేపీ విజ‌యంగా మోడీ ప్ర‌చారం చేసుకున్నారు. అయోధ్య అంశాన్ని బీజేపీ అలా రాజ‌కీయంగా వాడుకునేందుకు తెగ ప్ర‌య‌త్నించిన తొలి ఎన్నిక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు! అయోధ్యం అంశంతో పాటు మోడీ జార్ఖండ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో.. కాశ్మీర్ అంశాన్ని, పాకిస్తాన్ ను కూడా ప్ర‌స్తావించారు. వాటి ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ ను తిట్టిపోశారు. అలా సాగింది మోడీ ప్ర‌చారం. 

అయితే రామాల‌యం అంశాన్ని త‌మ విజ‌యంగా ప్ర‌చారం చేసుకుంటూ మోడీ ప్ర‌చారం చేసిన తొలి ఎన్నిక‌లోనే బీజేపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీ జార్ఖండ్ లో ఓట‌మి పాలైంది. మెజారిటీకి చాలా చాలా దూరంలో నిలిచింది. అయినా అక్క‌డ క‌మ‌లం పార్టీ వాళ్లు తిమ్మిని బ‌మ్మిని చేసి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చు గాక‌.. ఓట్ల లెక్క‌ల ప్ర‌కారం మాత్రం బీజేపీ ఓడిపోయిన‌ట్టే. సీట్ల లెక్క‌లు ఇక ఎలా ఉంటాయో అది వేరే క‌థ‌.