ఇలా ప్రకటన.. అలా దుష్ప్రచారం మొదలు

విశాఖపట్నం ప్రమాదం అంచుల్లో ఉంది. ఇక్కడి రక్షణ రహస్యాలన్నీ పాక్ తెలుసుకుంది, విశాఖలోని వివిధ సంస్థల సమాచారమంతా శత్రుదేశం దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఓ వర్గం మీడియా వరసబెట్టి కథనాలు ఇస్తోంది. ఇందులో జాగ్రత్తగా గమనించాల్సిన…

విశాఖపట్నం ప్రమాదం అంచుల్లో ఉంది. ఇక్కడి రక్షణ రహస్యాలన్నీ పాక్ తెలుసుకుంది, విశాఖలోని వివిధ సంస్థల సమాచారమంతా శత్రుదేశం దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఓ వర్గం మీడియా వరసబెట్టి కథనాలు ఇస్తోంది. ఇందులో జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. రక్షణ రంగ రహస్యాలు శత్రు దేశానికి వెళ్లాయన్న ఆందోళన కంటే.. విశాఖని కార్నర్ చేయడమే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది.

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ అనే పేరుతో ఇటీవల ఓ కీలక ఆపరేషన్ చేపట్టిన పోలీస్ అధికారులు ఏడుగురు నావికాదళ సిబ్బందిని అరెస్ట్ చేశారు. హనీ ట్రాప్ ద్వారా వీరిని ఆకర్షించి పాకిస్థాన్ మన రక్షణరంగ రహస్యాలు చేజిక్కించుకుందనేది అభియోగం. ఇలాంటి హనీట్రాప్ వ్యవహారాలు గతంలోనూ జరిగాయి, దేశంలోని వేర్వేరు కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న సాయుధ దళాల సిబ్బంది అప్పట్లో అరెస్ట్ అయ్యారు కూడా.

విశాఖ అంశం కూడా ఇలాంటిదే. పాకిస్థాన్ కి రహస్యాలు ఎంతవరకు చేరాయనేదానికంటే, విశాఖకి ఉగ్రముప్పు పొంచి ఉందనే విషయాన్నే హైలెట్ చేస్తూ కథనాలు అందిస్తోంది ఓ వర్గం మీడియా. కచ్చితంగా దీని వెనక మూడు రాజధానుల అంశం ఉందనేది కాదనలేని వాస్తవం. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, దీన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగడం, వారికి ప్రజా మద్దతు లేకపోవడం అన్నీ మనం చూస్తున్నవే.

కేవలం తమ అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని, తుళ్లూరులో ప్రజాయుద్ధం జరుగుతోందంటూ విషప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. అదే సమయంలో కర్నూలుకు వరద ముంపు ఉందని, విశాఖకు తుపాన్ ముప్పులున్నాయని చెప్పుకొస్తున్నారు. దీనికి కొనసాగింపే విశాఖకు ఉగ్ర ముప్పు కూడా ఉందనే అంశం.

ఇలాంటి కథనాలతో ప్రజలకు మీడియా ఏం చెప్పదలుచుకుంది? ప్రతిపక్షాల చేతిలో కీలుబొమ్మలా మారి, ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది.