నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) బిల్లు విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీలు చెరో మాట మాట్లాడటం గమనార్హం. పౌరసత్వ సవరణల చట్టం ఆమోదం పొందిన వెంటనే లోక్ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. సీఏఏ ఆమోదం పొందిందని, ఇక ఎన్ఆర్సీనే తరువాయి అని అంటూ ప్రకటించారు. లోక్ సభ సాక్షిగా అమిత్ షా ఆ ప్రకటన చేశారు.
దేశ వ్యాప్తంగా పౌరులు తమ భారతీయ పౌరసత్వానికి ఆధారాలు చూపాల్సి రావడమే ఎన్ఆర్సీ చట్టం ఉద్ధేశమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అస్సాంలో అమలు చేశారు. అక్కడ కొన్ని లక్షల మందికి భారతీయ పౌరసత్వం లేదు. వారిలో హిందువులు ఉన్నారు. ముస్లింలూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మోడీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం సవరణల ప్రకారం.. ఆ క్యాంపుల్లోని హిందువులు భారతీయ పౌరసత్వాన్ని పొందగలరు. అదే ముస్లింలు మాత్రం భారత పౌరసత్వం పొందడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు.
పక్క దేశాల నుంచి వచ్చే ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వరాదు అనేది పౌరసత్వ చట్టంలోని ప్రధానమైన సవరణ. హిందువులు, సిక్కులకు మాత్రం భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే అస్సాం వంటి చోట.. బంగ్లా నుంచి వచ్చిన హిందువుల విషయంలో కూడా స్థానికులు అభ్యంతరం చెబుతూ ఉన్నారు. దీంతో రచ్చ జరుగుతూ ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటన ఆసక్తిదాయకంగా మారింది. ఎన్ఆర్సీ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి చర్చా జరగలేదు.. అని మోడీ వ్యాఖ్యానించారు. కేబినెట్లో కానీ, లోక్ సభ లో కానీ ఆ అంశం గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన అన్నారు. దాన్ని బట్టి ఆ చట్టాన్ని అమలు చేసే ఉద్దేశం ఇప్పట్లో లేనట్టుగా మోడీ చెప్పదలిచారు. అయితే సీఏఏ ఆమోదం పొందగానే.. తరువాయి ఎన్ఆర్సీనే అంటూ అమిత్ షా చేసిన ప్రకటన ఈ సందర్భంగా చర్చకు వస్తూ ఉంది. మరి కేంద్ర హోంమంత్రి, ప్రధానిలు చెరో ప్రకటన చేయడం అనేక సందేహాలకు తావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.