బాలయ్యకు టీడీపీకీ ఏంటి సంబంధం అంతే కరెక్ట్ గా సమాధానం ఎవరూ చెప్పలేరేమో. ఆయన తండ్రి, మహా నాయకుడు ఎన్టీయార్ టీడీపీని స్థాపించారు. కానీ అందులో బాలయ్యకు కేవలం ఒక ఎమ్మెల్యేగానే బంధం ఉంది. అయినా ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడా సందడి చేసిన దాఖలాలు లేవు.
హరిక్రిష్ణకు కనీసం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ పదవి అయినా బాబు ఇచ్చారు. బాలయ్యకు ఆ హోదా కూడా లేదు. దాంతో ఆయన తన సినిమాలు తాను చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇక బాలయ్య అల్లుళ్ళు మాత్రం టీడీపీలో అల్లుకుపోదామని చూస్తున్నారు.
పెద్దల్లుడు ఎటూ చంద్రబాబు పుత్రరత్నం, రాజకీయ వారసుడు కాబట్టి లోకేష్ టీడీపీలో అన్నీ కూడా ఆయనేగా కధ నడుస్తోంది. ఇక చిన్నల్లుడుకి కేరాఫ్ మాత్రం బాలయ్యే. అందుకే ఆయన విశాఖ ఎంపీ టికెట్ మొన్న ఈ రూట్లోనే సాధించారు.
ఇపుడు ఆ బంధాన్ని గట్టిపరచుకోవడానికి డైరెక్ట్ గా బాబుతోనే అన్నీ అంటున్నారు. సరే పార్టీ ఎటూ ఏపీ వ్యాప్తంగా ఓడింది. దాంతో ఉన్నవారే బయటకు పోతున్న పరిస్థితి. దీంతో బాబు సైతం బాలయ్య చిన్నల్లుడి మీద అధారపడకతప్పడంలేదట.
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను తన కనుసన్నల్లో నడిపిన ఎంవీవీఎస్ మూర్తి చనిపోయాక పార్టీకి నమ్మిన బంటు కూడా ఎవరూ లేని సీన్ ఉందిట. మరో వైపు ఎంత ఖర్చుకైనా వెరవకుండా పార్టీ కోసం ఖర్చు చేసే మూర్తి లేని లోటు మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని తమ్ముళ్ళు అంటున్నారు.
ఇపుడు ఆయన గారి మనవడు, బాలయ్య చిన్నల్లుడికే ఈ బాధ్యతలు బాబు అప్పగించారని అంటున్నారు. ఇకపైన మూడు జిల్లాల్లో పార్టీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన భారం బాలయ్య చిన్నల్లుడేదనట.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఈ టైంలో ఎవరూ ముందుకు రాకపోవడం ఒక కారణమైతే. ఎంత కాదనుకున్నా తమ కుటుంబం వారి చేతిలోనే పార్టీ పగ్గాలు ఉంటే బాగుంటుందన్న మరో ఆలోచన వల్లనే చిన్నల్లుడు శ్రీ భరత్ కి బాబు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అంటే తాత బాటలో ఉత్తరాంధ్ర పార్టీ భారాన్ని ఇకపై భరత్ మోయాలన్న మాట. ఇప్పటికే పూర్తిగా చితికిపోయిన సైకిల్ కి కొత్త రిపేర్లు కూడా చేసి పరుగులు పెట్టించాలన్న మాట. మరి ఈ భారం చిన్నల్లుడు ఎంత వరకూ మోస్తారో. బాబు ఆయన్ని ఎంతవరకూ నమ్ముతారో రాజకీయ తెరపై చూడాల్సిందే