జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతూ ఉంది. ఇప్పటి వరకూ సాగిన కౌంటింగ్ ప్రకారం.. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి 43 స్థానాల్లో విజయం దిశగా సాగుతూ ఉన్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీని ఈ కూటమి దక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
హంగ్ తరహా ఫలితాలు తప్పవని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రీ పోల్, పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేశాయి. బీజేపీ అధికారం కోల్పోతుందని అంచనా వేసినప్పటికీ.. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని మాత్రం జార్ఖండ్ విషయంలో మీడియా సంస్థలు అంచనా వేశాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్, సర్వేలు అబద్ధం అవుతున్నాయి. కనీసం నలభై రెండు సీట్లున్న వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. గత పర్యాయంలో బీజేపీ మినిమం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికి ఆ అవకాశం దక్కేలా లేదు. ఇప్పటి వరకూ సాగిన కౌంటింగ్ లెక్కల ప్రకారం.. బీజేపీ కేవలం 27 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది. చిన్నాచితక పార్టీలతో కలిసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కేలా లేదు. కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీని సంపాదించుకునేలా ఉంది.