టాలీవుడ్ లో బిజీ కాక ముందు కన్నడనాట మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మికకు ఎనలేని గుర్తింపు వచ్చింది. అదే సమయంలో తన సహనటుడు రక్షిత్ షెట్టితో రష్మిక ప్రేమలో పడింది. వెనువెంటనే వారు పెళ్లికి కూడా రెడీ అయిపోయారు. నిశ్చితార్థం చేసుకుంది ఆ జంట. అంతలోనే రష్మికకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి.
గీతగోవిందం సినిమాకు సంబంధించి టీజరే రష్మికను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆ సినిమా కు సంబంధించి విజయ్ దేవరకొండ, రష్మిక ముద్దుముచ్చట.. కన్నడ సినీ ప్రేక్షకుల్లో దుమారం రేపింది. రష్మిక ను నిందించసాగారు కన్నడీగులు. అప్పటికే ఎంగేజ్ మెంట్ అయిన నేపథ్యంలో అలా నటించడం ఏమిటంటూ ఆమెతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లంతా దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత చాలా మంది ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా రష్మిక నిశ్చితార్థం రద్దును ప్రకటించింది.
దీంతో సంప్రదాయవాదుల దృష్టిలో రష్మిక మరింత చెడ్డది అయ్యింది. ఆమెను తప్పు పడుతూ సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు పెట్టారు. ఇక ఈ అంశం గురించి చాన్నాళ్ల తర్వాత రక్షిత్ షెట్టి స్పందించాడు. రష్మికను అస్సలు నిందించడం లేదు ఈ నటుడు. రష్మిక తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా సమర్థించాడు కూడా. 'ఆమెకు పెద్ద పెద్ద కలలున్నాయి..' అని మాత్రం అతడు వ్యాఖ్యానించాడు.
ఆమె వాటిని సాకారం చేసుకోవాలని కూడా ఆకాంక్షించాడు. 'మీ అందరి కన్నా రష్మిక గురించి నాకు బాగా తెలుసు. ఆమెకు పెద్ద పెద్ద కలలున్నాయి. వాటిని సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా…' అంటూ రక్షిత్ షెట్టి వ్యాఖ్యానించాడు. ఇలా తన మాజీ ప్రియురాలును ఏ రకంగా నిందించకుండా.. ఆమె కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు చేరాలని రక్షిత్ ఆకాంక్షించాడు.