హీరోలు అన్నాక గన్ లు, ఆయుధాలు పట్టుకోవడం కొత్త కాదు. అయితే అదంతా స్క్రీన్ మీద. ఆఫ్ ది స్క్రీన్ ఆయుధాలు పట్టుకోవడం అంటే అంత వీజీ కాదు. అంత అవసరమూ రాదు. లైసెన్స్ వుండాలి. వున్నా ఉట్టికి ఉట్టినే గన్ పట్టుకుని వీరవిహారం చేయడానికి వీలు కాదు. అయితే హీరో రామ్ కు వచ్చిన ఓ ఆహ్వానం, ఆ అవకాశం కల్పించింది.
నిజం గన్ లు పట్టుకుని, ఢామ్..ఢామ్ అని పేల్చినట్లు ఫీలయిపోయి, పోజులు ఇచ్చే చాన్స్ దొరికింది. విషయం ఏమిటంటే..రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.
ఆ కార్యక్రమానికి హాజరైన రామ్ పలు గన్ లు తీసుకుని, అసలు ఎలా పట్టుకోవాలి, ఎలా గురి పెట్టాలి. ఎలా పేల్చాలి వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా నేర్చుకున్న విషయాలు రాబోయే సినిమాల్లో అమలులో పెడతారన్నమాట. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47… ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు.
షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రయోగం కూడా చేశారు. ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది… సినిమా లాగా లేదు . చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి’అన్నారు.