మరికాసేపట్లో రీ-పోస్టుమార్టం.. ఏం తేలుస్తారు?

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితులకు ఈరోజు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసింది.…

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితులకు ఈరోజు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన వైద్యుల బృందం ఈరోజు 4 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని బంధువులకు అప్పగిస్తారు.

డిసెంబర్ 6 తెల్లవారుఝామున ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో కేసులు నమోదవ్వడం, వాటిని హైకోర్టుకు బదలాయించడంతో మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణతో సంబంధం లేని వైద్యులతో నిర్వహించాలని స్పష్టంచేసింది. దీంతో ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యుల బృందం నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరుకుంది.

పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. ఆధారాలు సేకరించిన తర్వాత వాటిని సీల్డ్ కవర్ లో భద్రపరుస్తారు. తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్ తో పాటు వీడియోను హైకోర్టుకు సమర్పిస్తారు. అయితే మహబూబ్ నగర్ లో సరైన సౌకర్యాలు లేని కారణంగా మృతదేహాలు సగానికి పైగా కుళ్లిపోయినట్టు చెబుతున్నారు వైద్యులు. దీంతో గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. దీంతో ఇవాళ్టి పోస్టుమార్టంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

షాద్ నగర్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద దిశ అత్యాచారానికి గురైంది. మద్యం పట్టించి ఆమెను అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను నిందితులు లారీలో చటాన్ పల్లి తీసుకెళ్లారు. లారీలో కూడా ఆమెపై అత్యాచార చేశారు. తర్వాత దుప్పట్లో చుట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో కీలక నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్ ను గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత వీళ్లంతా దిశ మృతిచెందిన చటాన్ పల్లి ఘటనాస్థలంలోనే ఎన్ కౌంటర్ కు గురయ్యారు.