అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఊపు క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇటీవలే జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పరిణామాలు అంత కలిసి రాలేదు. హర్యానాలో బీజేపీ మెజారిటీని కోల్పోయింది. అయితే మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక మహారాష్ట్రలో కూటమిగా పోటీ చేసిన బీజేపీ-శివసేనలు కనీస మెజారిటీని అయితే పొందాయి. గతంతో పోలిస్తే కొన్ని సీట్లను కోల్పోయాయి.
అయితే బీజేపీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అలా దేశంలోని ఒక కీలకమైన రాష్ట్రం బీజేపీ చేజారింది.
మరోవైపు జార్ఖండ్ కూడా భారతీయ జనతా పార్టీ చేజారిన దాఖలాలు కనిపిస్తున్నాయి. క్రితం సారి మినిమం మెజారిటీతో జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే ఈ సారి మాత్రం అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతోంది. ఇప్పటి వరకూ వెళ్లడైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ కూటమి అక్కడ 39 సీట్లలో లీడింగ్ లో ఉంది.
భారతీయ జనతా పార్టీ 31 సీట్లలో మాత్రమే లీడింగ్ లో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 41 సీట్లు కావాలి ఆ రాష్ట్రంలో. కాంగ్రెస్ కూటమే మెజారిటీకి దగ్గరగా ఉంది. రెండు మూడు సీట్లతో చిన్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతూ ఉన్నాయి. మరి కాసేపట్లో పూర్తి ఫలితాలపై క్లారిటీ వస్తుంది.