రాయలసీమ వాసుల కల సాకారం అయ్యేవేళ, తండ్రి ఆశయాన్ని తనయుడు నెరవేర్చుతున్న సందర్భం…ఎట్టకేలకు ముచ్చటగా మూడోసారి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు మూడో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద సోమవారం ఉదయం పది గంటలకు ఉక్కు ఫ్యాక్టరీకి జగన్ శంకుస్థాపన చేయనున్నారు.ఒక వైపు ఫ్యాక్టరీ నిర్మించాల్సిన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోగా, వైఎస్ జగన్ ‘ఉక్కు’ సంకల్పంతో ముందడుగు వేయడం వల్లే ఈ రోజు ఓ చరిత్రాత్మక ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారాన్నినిర్మించేందుకు….రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు.
వైఎస్సార్ హయాంలో బీజం
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి 2007లో బీజం పడింది. ఈ పరిశ్రమ నిర్మాణానికి జమ్మలమడుగు మండలం అంబవరం దగ్గర బ్రహ్మణీ స్టీల్స్ సంస్థకు 10,670 ఎకరాలను నాటి సీఎం వైఎస్సార్ కేటాయించారు. రూ.20 వేల కోట్లతో నాలుగు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించారు. 2007, జూన్ 10న వైఎస్ శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ మరణానంతరం 2011లో నాటి కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది.
2018లో చంద్రబాబు శంకుస్థాపన
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు మేల్కొన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి రాయలసీమ వాసుల ఓట్లు కొల్లగట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాయలసీమ స్టీల్స్ అథారిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసి మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె దగ్గర 3,892 ఎకరాలు కేటాయించారు. 2018, డిసెంబర్ 27న చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
సీఎం జగన్ చొరవ
ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో వైఎస్ జగన్ సర్కార్ 3,275.66 ఎకరాలను కేటాయించింది. చంద్రబాబు శంకుస్థాపన చేసి ఏడాది గడవకనే అదే జమ్మలమడుగు నియోజకవర్గంలో మరో ప్రాంతంలో సీఎం హోదాలో జగన్ శంకుస్థాపన చేస్తుండడం విశేషం.
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారం చేపట్టి ఆరునెలల కాలంలోనే తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం…కేవలం జగన్ ‘ఉక్కు’ సంకల్పమే కారణమని చెప్పవచ్చు