లోకేశ్ పాదయాత్రలో తన సామాజిక వర్గానికి చెందిన నాయకులపై అభిమానం, బలిజ నాయకులపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. లోకేశ్‌పై తిరుపతి బలిజ నాయకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా తిరుపతిలో తమను అవమానించేలా లోకేశ్ వ్యవహరించారని బలిజలు మండిపడుతున్నారు. ఇదే తన సామాజిక వర్గంతో పాటు రెడ్లకు కూడా లోకేశ్ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆవేదన బలిజల్లో నెలకుంది.
తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో లోకేశ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పేరును లోకేశ్ ప్రకటించారు. కానీ తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించలేదు. అంతేకాదు, అక్కడ సుగుణమ్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. దీన్ని సుగుణమ్మ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. నగరి అభ్యర్థిగా గాలి భానుప్రకాశ్, చంద్రగిరిలో పులివర్తి నాని, శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌కు లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని సుగుణమ్మ అనుచరులు, కొందరు బలిజలు ప్రస్తావిస్తున్నారు.
ఇక్కడ ప్రధానంగా వారు లేవనెత్తుతున్న అంశం ఏంటంటే… లోకేశ్ ప్రకటించిన అభ్యర్థుల్లో చంద్రగిరి, నగరిలో తమ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పచ్చ జెండా ఊపారని. అలాగే శ్రీకాళహస్తికి వెళితే… అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఓకే చేశారని సుగుణమ్మ అనుచరులు చెబుతున్నారు. కానీ జిల్లాలో బలిజలు బలంగా ఉన్న తిరుపతిలో మాత్రం సుగుణమ్మకు టికెట్ ఖరారు చేయకపోవడం, ఆ వర్గంపై లోకేశ్ వివక్ష కాకుండా మరేంటని నిలదీస్తున్నారు.
ఇటీవల తిరుపతి నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశంలోనూ సుగుణమ్మతో పాటు ఆమె అనుచరులకు లోకేశ్ క్లాస్ తీసుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికలతో పాటు టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ కనీస పోటీ ఇవ్వకపోవడం ఏంటని లోకేశ్ మండిపడ్డారు. తన తండ్రి చంద్రబాబులా మెతక వైఖరితో వ్యవహరించనని, ఎంతటి వారినైనా పక్కన పెడతానని సుగుణమ్మకు వార్నింగ్ ఇవ్వడాన్ని బలిజలు గుర్తు చేస్తున్నారు.
ఇదే చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పానికి వెళితే… ఏం పీకారని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలకు మాత్రం పెద్దపీట వేస్తూ, తమను అణచివేస్తున్నారని తిరుపతి బలిజలు మండిపడుతున్నారు. తన వాళ్లంటే లోకేశ్‌కు “కమ్మ”గా వుంటారని, ఇతరులైతో చేదు అని వారు మండిపడుతున్నారు.