తెలుగుదేశం పార్టీకి శత్రువులు ప్రత్యేకంగా ఎలాంటి కీడు చేయవలసిన అవసరం లేదు. ఆ పార్టీని సర్వనాశనం చేయడానికి, ఆ పార్టీకి సమాధి కట్టేయడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం మాత్రమే సరిపోతుంది.. అని ఆయన మాటలను గమనిస్తే మనకు అర్థం అవుతుంది.
ఇటీవలి కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకురావడం అనే ప్రక్రియలో భాగంగా తరచుగా సమావేశాలు పెడుతున్న చంద్రబాబు నాయుడు, తాజాగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే మాటలు అన్నారు. ఈ మాటలను ప్రజలు గమనిస్తే.. ఆ పార్టీని రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా బొంద పెట్టడం ఖాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు మీద పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే.. కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశానికి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీలో కొంచెం కదలిక కనిపిస్తోంది. పార్టీ ప్రస్తుతానికి రాష్ట్రమంతా శవాసనం వేసి ఉన్నది కానీ, ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారు. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఎన్టీ రామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం మొదలైన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలకు ప్రతిరోజు అన్నం తినడం అలవాటు అయిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏ రకంగా చూసినా సరే ఇది ఆయనలోని అహంకారానికి నిదర్శనం. అసలే తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందనే ఆవేదనతో తెలంగాణ ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు.
ఇప్పుడు కూడా వారిని కించపరిచే లాగా చంద్రబాబు ఇలాంటి మాటలు అనడం ఖండనార్హం. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని.. 11వ శతాబ్దంలోనే తెలంగాణలో వరి గోధుమలు పండుతున్న దాఖలాలు ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు ధ్వజమెత్తుతున్నారు.
గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో.. తనది రెండు కళ్ళ సిద్ధాంతం అనే మాట ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పడుకోబెట్టేశారు. తర్వాత ఎన్నికలలో కూడా ఆ పార్టీ ఎన్నటికీ కోలుకోలేకపోయింది. ఇప్పుడు పార్టీకి పునర్వైభవం తెస్తానంటూ నడుము బిగించిన చంద్రబాబు, ‘తెలంగాణ ప్రజలకు అన్నం అంటే ఏమిటో తెలియజెప్పింది తామే’ అహంకారపూరితమైన వ్యాఖ్యల ద్వారా తన సొంత పార్టీకి పూర్తిగా సమాధి కట్టేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.