ఆదాణీ వ్యవహారంపై రాయండి అని కొందరు పాఠకులు అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది రాస్తున్నారు, చెప్తున్నారు. ఖండనమండనలు కొన్నాళ్లు సాగి, పరిస్థితిలో స్పష్టత వచ్చాక, కొన్ని వివరాలతో రాద్దామని ఆగాను. ఈ లోపున మాత్రం కొన్ని విషయాలపై వ్యాఖ్యానించక తప్పటం లేదు. ముందుగా పేరు గురించి – తెలుగు మీడియా అదానీ అని రాస్తోంది, పలుకుతోంది. కొందరు యూట్యూబు వ్యాఖ్యాతలు ఆదానీ అని అంటున్నారు. ఆయన మాతృభాష గుజరాతీలో ఆయన పేరు అదాణీ అని రాస్తారు కాబట్టే దాన్నే వాడుతున్నాను.
హిండెన్‌బర్గ్ నివేదికలో తప్పొప్పుల గురించి, అదాణీ చేసిన అక్రమాల గురించి, సక్రమాల గురించి నేను రాయబోవటం లేదు. అవన్నీ తేలడానికి టైము పడుతుంది. ఈలోగా అదాణీపై ఆరోపణల వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని, ఒక భారతీయుడిగా దాన్ని ఖండించాలని, అదాణీకి మద్దతుగా నిలబడాలని వాట్సాప్‌లు పంపేవారి గురించే దీన్ని రాస్తున్నాను. ఆదాణీ మోదీకి సన్నిహితుడా కాదా అన్న విషయం పక్కన పెడదాం. అతనొక పారిశ్రామికవేత్త. అతని ఆర్థిక వ్యవహారాల్లో గోల్‌మాల్ జరిగింది అని ఒక విదేశీ సంస్థ ఆరోపించింది.
ఇలాటివి మనకు కొత్తా? పనామా పేపర్లని, మరోటని, ఎంతమందిపై ఆరోపణలు రాలేదు? వాటిలో కొన్ని నిజాలుండవచ్చు. కొన్ని బురదజల్లుడు కార్యక్రమాలుండవచ్చు. అది ఆ సంస్థ తలకాయనొప్పి. తన యిమేజి కాపాడుకోవడానికి వివరణలు యిచ్చుకుంటుంది. ఆరోపణలు చేసినవారిపై కోర్టుకి వెళుతుంది. ఇన్వెస్టర్ల, స్టాక్‌మార్కెట్ ఆపరేటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుంది. అంతే కదా! ఈ మాత్రం దానికి కొన్ని గ్రూపులు ఓవర్‌గా రియాక్టయి పోతున్నాయెందుకు? ఇలా ఆరోపణలు చేయడం మన దేశం ఎదుగుదలను, ఆర్థికప్రగతిని అడ్డుకోవడానికట. విదేశాలు కలిసికట్టుగా కుట్ర చేసేస్తున్నాయట. హిండెన్‌బర్గ్ సంస్థ బోగస్‌దట. దానిలో ఐదుగురే ఉద్యోగులున్నారట. దాని అధిపతి ఒకప్పుడు కారు డ్రైవరుట. మనమంతా అదాణీ వెంట నిలబడి దేశం కోసం పోరాడాలట… యిలా ఎన్నో వాట్సాప్‌లు ఒకదానిపై మరొకటి వచ్చి పడిపోతున్నాయి.
వాటిని పుట్టించినవారి తలపులో ఏముందో, సృష్టి ప్రయోజనమేమిటో తెలియదు. ఆ విధాత కానరాడు. అందుచేత నాకూ, మీకూ వాటిని ఫార్వార్డ్ చేస్తున్నవాళ్లనే అడగాల్సి వస్తోంది, అవసరమా యిదంతా? అని. హిండెన్‌బర్గ్ రాసినదంతా తప్పు అని నువ్వు గ్యారంటీగా చెప్పగలవా? అసలు అదాణీ వ్యాపారవిస్తరణ ఎలా జరిగిందో నువ్వు స్టడీ చేశావా? వాళ్ల 413 పేజీల సమాధానం నువ్వు చదివేవా? అర్థమైందా? దానిలో 80శాతం గ్యాసే, అసలు ప్రశ్నల సమాధానాలు దాటవేశారు అని హిండెన్‌బర్గ్ అంటే కాదని నువ్వు వాదించగలవా? నీకు ఏమీ తెలియదు. తెలిసిందేమిటంటే అదాణీ భారతీయ కుబేరుడు. అందువలన మనం వెనకేసుకుని రావాలి. అతన్ని విమర్శించేవాళ్లు కుట్రదారులు. ఆ విమర్శలో నిజముందేమోనని శంకించేవారు దేశద్రోహులు.
ఒక్క క్షణం ఆలోచించండి. స్టాక్ మార్కెట్ స్కాములు, డొల్ల కంపెనీలు, టాక్స్ హేవెన్‌ల ద్వారా తమ డబ్బే పెట్టి, విదేశీ పెట్టుబడులు వచ్చేస్తాయని డప్పు కొట్టి స్టాక్ రేటు పెంచుకోవడం, మానిప్యులేట్ చేయడం, ఎకౌంట్లలో ఫ్రాడ్ చేయడం, ఉన్న ఆస్తుల విలువ ఎక్కువగా చూపించి బ్యాంకు ఋణాలు తీసుకోవడం, దొంగ రాయితీలు పొందడం, పరిశ్రమల పేర ప్రభుత్వాల నుంచి భూములు కేటాయింప చేసుకోవడం, పైసా పెట్టుబడి పెట్టకుండా వాటిని తాకట్టు పెట్టి బ్యాంకులో ఋణాలు తీసుకోవడం… యివన్నీ భారతీయులకు రాని విద్యా? ఎందరో చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు.
ఇక్కడ ప్రశ్నేమిటంటే అదాణీ కూడా అలా చేశాడా లేదా అన్నది. అది పరిశోధిస్తే తేలుతుంది. తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈలోగా కామన్‌సెన్స్‌తో వచ్చే అనుమానాలుంటాయి. ముకేశ్ అంబానీది ప్రపంచ ధనికుల్లో ఫలానా స్థానం అంటే వింతేముంది అనుకుంటాం. ఎందుకంటే ముందు తరం నుంచి వాళ్లు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా వాళ్లని మేనేజ్ చేస్తూ అన్ని రంగాల్లోకి దూసుకుపోతూ, ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ ఎదుగుతున్నారు. మరి అదాణీ ఆరేడేళ్లలోనే ఒక్కసారిగా ఎదిగిపోయి, అంబానీని కూడా తలదన్నేశాడంటే యీ నడమంత్రపు సిరి ఎక్కణ్నుంచి, ఎలా వచ్చింది అనే సందేహం రాకమానదు. ఏదైనా నేరం జరిగితే పోలీసులు కూడా యిదే కోణంలో ఆలోచిస్తారు. ఎవరైనా అనుమానితుడి జీవనసరళలో సడన్‌గా మార్పు వచ్చిందా అని తరచి చూస్తారు.
ఈ మాట అడగ్గానే అదాణీ ఆరేళ్ల క్రితం జంతికలు అమ్ముకుని బతికాడా అని అడుగుతారు కొందరు. జంతికలు అమ్మలేదు, అలాగే జెట్ విమానాలూ అమ్మలేదు. అనేకమంది వ్యాపారస్తుల్లో అతను ఒకడుగా సాదాసీదాగా ఉన్నాడు. హఠాత్తుగా యింత పెద్దవాడు కావడం వెనక మర్మమేమిటి? అనేది ఆసక్తికరం. ఆ విద్యేమిటో తెలిస్తే మరో పదిమంది యిదే ధోరణిలో తయారై భారతదేశ ప్రతిష్ఠను పది రెట్లు పెంచవచ్చు కదా! విదేశాలు కుళ్లుకుని చచ్చేట్లు చేయవచ్చు కదా! మన దేశపు నియంత్రణ సంస్థలుండగా విదేశీ వాడెవడో వచ్చి ప్రశ్నించడమేమిటి అనేది మరో పిచ్చి ప్రశ్న. మన సంస్థలు సరిగ్గా పని చేస్తే హర్షద్ మెహతాలు, కేతన్ పారేఖ్‌లు, నీరవ్ మోదీలు, విజయ్ మాల్యాలు.. వీళ్లంతా ఎలా మోసాలు చేయగలిగారు? అవసరమైన టైములో కళ్లు మూసుకుని ఎడాపెడా ప్రజల డబ్బు దోచిపెట్టి, మోసగాళ్లను విదేశాలు పారిపోనిచ్చి, అప్పుడు వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నాం, బ్రిటన్ కోర్టులో పోరాడుతున్నాం అంటూ ఏళ్లకు ఏళ్లు కాలక్షేపం చేస్తాయి యీ సంస్థలు. సత్యం రామలింగరాజు తనంతట తను బయటపడకపోతే యీ సంస్థలు పట్టుకునేవా?
ఎవరైనా రాజకీయ నాయకుడు యిదేమిటని ప్రశ్నిస్తే, మీ పార్టీ హయాంలో మాత్రం జరగలేదా? అసలు వాడు బ్యాంకు ఖాతా తెరిచినది మీరు ఏలుతున్న రోజుల్లోనే! అంటూ ఎదురు వాదిస్తారు. అదాణీ మోదీకి ఆప్తుడు, ఆయన వలననే మరింతగా ఎదిగాడు అని ప్రతిపక్షాలు అనగానే మరి కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో పెట్టుబడులు ఎలా పెట్టనిచ్చారు? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అతన్ని ఎందుకు ఆహ్వానించాయి? అని బిజెపి వాళ్లు అడుగుతున్నారు. వాస్తవమేమిటంటే యీ అపరకుబేరులకు అన్ని పార్టీలలోనూ ఆప్తులుంటారు. వారు ఎవరినైనా ప్రభావితం చేయగలరు. రాజకీయ నాయకులకు కావలసివి నిధులు. అవి సమకూరుస్తూ యీ పెట్టుబడిదారులు అందరి హయాంలలో తమ పనులు కానిచ్చుకుంటారు. ఓ పార్టీ హయాంలో తక్కువగా ఎదగవచ్చు, మరో వారి హయాంలో ఎక్కువగా కావచ్చు. స్థాయీ భేదమంతే, ఎదుగుదల తప్పదు.
అంబానీల అక్రమమార్గాల గురించి ఎప్పణ్నుంచో ఆరోపణలు వింటున్నాను. ప్రతిపక్షంలో ఉండగా వాళ్లపై రంకెలు వేసి, మేం అధికారంలోకి వస్తే విచారణకు ఆదేశించి, వాళ్ల గుట్టు బయటపెడతాం అని హామీలిచ్చినవాళ్లు, అధికారంలోకి రాగానే పెదవి విప్పరు. ఇవాళ అదాణీ మోదీ తొత్తు, ఎంక్వయిరీ వేయాలి అని కేకలు వేసేవాళ్లు ఏదో మాజిక్ జరిగి హఠాత్తుగా పవర్‌లోకి వచ్చేసినా, ఏమీ జరగదు. పేరుకి విచారణ అన్నా అది నత్తనడక నడుస్తుంది. ఎందుకంటే అదాణీకి సహకరించిన వ్యవస్థల అధినేతలు, తోడుదొంగలు అవే స్థానాల్లో కంటిన్యూ అవుతారు కదా. వాళ్లు ఆనవాళ్లు చెరిపేస్తారు, ఆధారాలు మాయం చేస్తారు. అదాణీ మీద ప్రేమతో కాదు, స్వీయచర్మ రక్షణ కోసం! అందుకే యీ కుబేరులు ఎవరితో ఏ పని, ఎప్పుడు పడుతుందో తెలియక అన్ని పార్టీల వారినీ, అధికారులనూ మేపుతూ ఉంటారు.
అన్నిటికన్న చిత్రమైనది, ఆంధ్ర ప్రభుత్వం ప్రవర్తన. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చేదాకా అదాణీ పెద్ద తోపు అనుకుని పోర్టులు, అనేక ప్రాజెక్టులు కట్టబెట్టాం అని చెప్పుకుంటే సరేలే అనుకోవచ్చు. ఆ రిపోర్టు వచ్చి, స్టాక్ మార్కెట్‌లో అదాణీ షేర్ల విలువ కుప్పకూలిన తరుణంలో, పార్లమెంటులో అదాణీ వ్యవహారాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలో, ఫిబ్రవరి రెండవ వారంలో ఆంధ్ర ప్రభుత్వం ఆ కంపెనీకి, 2022 జూన్‌లోనే ఒప్పందం చేసుకున్నామంటూ 400 ఎకరాలు అప్పగించడం దారుణం, హేయం. అదాణీ నిలదొక్కుకునేదాకా కాస్త ఆగవచ్చు కదా! బిజెపి చెప్పినట్లు జగన్ ఆడుతున్నాడు, కృష్ణపట్నం పోర్టు ధారాదత్తం చేశాడు, వైజాగ్ స్టీలు ప్లాంటు కూడా రేపోమాపో అదాణీకి కైంకర్యం చేస్తాడు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో యీ భూమి అప్పగింత వాయిదా వేయవచ్చు కదా! రేపు ఆ కంపెనీ మునిగితే, ఎవరిది బాధ్యత?
ఈ ముఖ్యమంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం ప్రజల ఆస్తిని కార్పోరేట్లకు అతి చౌకగా అప్పగించేస్తారు. అవి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టేసి, అప్పు తీసుకుని, నిధులు మళ్లిస్తారు. నష్టపోయేది బాంకు డిపాజిటర్లు. వాటితో పోలిస్తే స్టాక్ మార్కెట్‌లో నష్టాలు పెద్ద లెక్కలోకి రావు. ఈ షేర్ల విలువ అంతా నోషనల్. పది లక్షల కోట్లు ఆవిరయ్యాయి అంటే ఆ మేరకు భవంతులు కూలిపోయాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయాయి అని కాదు. దాని విలువ యింత అనుకున్నావు, అది మారింది. మారినందువలన నష్టపోయేది స్టాక్ మార్కెట్ జూదరులే. బోగస్ కంపెనీల ద్వారా కృత్రిమంగా షేరు మార్కెట్ ధర పెంచి, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించి, షేర్లు కొనిపించి, అదను చూసి షేరు ధర పడగొట్టి, వాళ్ల డబ్బు కాజేయడం అనేది ఎప్పణ్నుంచో జరుగుతోంది. అది తెలిసి కూడా షేర్లు కొనేవాళ్లకు జూదరి మనస్తత్వం ఉన్నట్లే.
వాళ్ల డబ్బు వాళ్ల యిష్టం. వచ్చినపుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. వాళ్ల గురించి మరీ అంత జాలి పడనక్కర లేదు. ఎందుకంటే స్టాక్‌మార్కెట్‌లో యీ ఆటాడే వృషభాలూ, భల్లూకాలు మామూలు జనాల జేబులు కొట్టేయటం లేదు. అత్యాశతో తమ వద్దకు వచ్చినవాళ్లనే మోసం చేస్తున్నారు. కానీ యీ క్రీడ స్టాక్‌మార్కెట్‌కే పరిమితం కావటం లేదు. ఆ కంపెనీ వాడు కృత్రిమంగా రేటు పెంచిన తన షేర్లను కుదువ పెట్టి బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నపుడే వస్తోంది గొడవ. విజయ్ మాల్యా చేసింది అదే కదా! ఎకౌంటింగ్ ఫ్రాడ్ చేసి కంపెనీకి అంత గుడ్‌విల్ ఉంది, యింత ఉంది అని బాంకులను నమ్మించాడు, వంచించాడు. బ్యాంకులు అమాయకంగా నమ్మి (అలా మనం నమ్మాలని వాళ్ల ఆశ) వాటిని కూడా ఆస్తులుగా లెక్కగట్టి అప్పు యిచ్చేశాయి. తర్వాత చూసుకుంటే అంతా నీటిబుడగ! బాంకులు చేసిన యీ పొరపాటుకి, లేదా ఫ్రాడ్‌కు నాబోటి, మీబోటి డిపాజిటర్లు దిబ్బయిపోయాం, పోతున్నాం. అందుకే మనం ఆందోళన పడతాం.
2022 డిసెంబరు నాటికి అదాణీ పోర్ట్‌స్ 17శాతం షేర్లు తనఖా పెట్టాయట. గ్రూపులో యితర కంపెనీల సంగతేమిటో తెలియదు. అదాణీ కంపెనీల సామర్థ్యంపైనో, వారి అంకెల పైనో నమ్మకం లేక కాబోలు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టలేదట. ఎల్‌ఐసి, ఎస్‌బిఐ భారీగా పెట్టాయట. ‘హిండెన్‌బర్గ్ నివేదిక బోగస్, అదాణీ సూపర్ స్ట్రాంగ్, యీ అంకెల కంటె భారతీయత సెంటిమెంటే ముఖ్యం’ అనుకుని మనం గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు. కానీ సెంటిమెంట్ల బాదరబందీ లేకుండా మన కంటె రిపోర్టులను ఎక్కువగా స్టడీ చేసే ఫారిన్ ఇన్వెస్టర్లు నమ్మారు. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. దాంతో మన స్టాక్ మార్కెట్‌లో అదాణీ షేర్ల విలువ మరింత పతనమైంది!
అదాణీ కేసులు వేయడంలో ఘనుడు. తన కంపెనీ ఆర్థిక లావాదేవీల గురించి అనుమానాలు వ్యక్తం చేసిన జర్నలిస్టులు, వెబ్‌సైట్లు, సంస్థలపై పరువునష్టం కేసులు చాలానే వేశాడట. ఇప్పుడు హిండెన్‌బర్గ్‌పై కూడా వేస్తానని బెదిరించాడు. వేస్కో, తడాఖా చూపిస్తాం అన్నారు వాళ్లు. నెలవుతున్నా యింకా వేయలేదు. వాళ్లు రెండేళ్లు పరిశోధించి నివేదిక యిచ్చాం అన్నారు కాబట్టి, పక్కా జవాబు తయారు చేసుకుని కేసు వేయడానికి వీళ్లకు రెండు నెలలైనా పడుతుందేమో చూడాలి. అది వచ్చాక ఆర్థిక నిపుణులు రెండూ పరిశీలించి చెప్తే మనబోటి వాళ్లకు యథార్థ పరిస్థితి అర్థమౌతుంది.
నివేదికంతా బోగస్ అని చెప్తూన్నా దాన్ని నమ్మేవాళ్లు ఎక్కువగా ఉన్నట్లు అదాణీకి మనసులో తోచిందేమో, జాగ్రత్త పడసాగాడు. గ్రూపు పేరు చెడకుండా చూడడానికి కొన్ని ఋణాలు గడువుకి ముందే తీర్చేశాడు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌లో 20 వేల కోట్ల రూ.లు వచ్చినా వెనక్కి యిచ్చేశాడు. ఏదో యిలాగే తన కంపెనీ వ్యవహారాలు చక్కదిద్దుకుని, మన డబ్బుకి సున్నం పెట్టకుండా ఉంటే అతనికి దండం పెట్టుకోవాలి. కానీ అదాణీ ఆస్తుల కంటె అప్పులు ఎక్కువ అని ఆ మధ్య రిపోర్టు వచ్చింది. షేరు విలువ ఆధారంగా ఆస్తులు విలువ కట్టారేమో తెలియదు. అలా అయితే మరీ డేంజరు. ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్థితుల్లో మనం అదాణీని వెనకేసుకుని రావడం దేనికి? పెద్ద సంస్థ అనా? సహారా కూడా ఒకప్పుడు గొప్పదే, విజయ్ మాల్యా గారి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్సూ గొప్పదే, అదంతా మన డబ్బుతోనే హంగు చేశారని తెలిశాక కంగు తిన్నాం. కానీ అప్పటికే టూ లేట్.
నాకున్న పరిమిత నాలెజ్‌తో నేను అదాణీ గ్రూపు గురించి ఏ తీర్పూ యివ్వలేను. గట్టు మీద కూర్చుని గమనిస్తున్నానంతే. సాటి భారతీయుడు కదాని అదాణీకి సచ్ఛీలుడు అని వాట్సాప్ వీరులు సర్టిఫికెట్టు యిస్తున్నారు, నేను ఫ్రాడ్ చేశాను అని రామలింగరాజులా అతను చటుక్కున ఒప్పేసుకుంటే అప్పుడు వీరందరూ బిత్తర పోతారు కదా పాపం అని అనుకుంటున్నాను. ఇన్నాళ్లూ వీళ్లంతా హిండెన్‌బర్గ్‌ను, అమెరికాను, యూరోప్‌ను నానా బూతులూ తిట్టారు. ఇప్పుడు అదాణీ వికీపీడియాను మేనేజ్ చేయబోయాడని బయటకు వచ్చింది. అంతా బాగానే ఉంటే కిరాయి ఎడిటర్ల ద్వారా వాటిని ఎందుకు మానిప్యులేట్ చేయాల్సి వచ్చింది? యాక్షన్ కంటె రియాక్షనే ఎక్కువ అనుమానాలు తెచ్చిపెడుతోంది. తన కంపెనీ నిలబెట్టుకోవాలనే ఆతృత అదాణీ రియాక్షన్‌కు కారణం అనుకోవచ్చు. మరి సంఘీయుల రియాక్షన్‌కు కారణమేమిటి?
బిబిసి గోధ్రాపై డాక్యుమెంటరీ ప్రదర్శిస్తే అది భారతదేశంపై దాడి అన్నారు. దేశవిభజన సమయంలో జరిగిన మతకలహాల గురించి, 1984లో శిఖ్కులపై దాడి గురించి, స్వర్ణదేవాలయంపై జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ గురించి, బాబ్రీ మసీదు కూల్చివేత గురించి.. యిలా అనేక వాటిపై విదేశీ మీడియా చెప్తూనే ఉంది. అప్పుడెప్పుడూ దేశప్రతిష్ఠకు భంగం కలగలేదా? అది కాంగ్రెసు హయాంలో జరిగింది కాబట్టి వాళ్లు విమర్శించినా ఓకేనా? అయినా గోధ్రా గురించి కూడా ఇరవై ఏళ్లగా విదేశీ మీడియా చెప్తున్న విషయమే కదా అది. అప్పణ్నుంచీ దేశంపై దాడి జరుగుతూన్నట్లేనా? మరి వాళ్లతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం దేనికి? బోఫోర్స్ గురించి విదేశీ మీడియా చెప్పినప్పుడు దాన్ని దేశంపై దాడిగా అనుకోలేదే! దాన్ని నమ్మి యిక్కడ రాజీవ్ గాంధీని ‘చోర్ హై’ అంటూ దింపేశాం కదా!
2019 ఎన్నికలకు ముందు టిడిపికి నిధులు సమకూర్చేవారిపై యిన్‌కమ్ టాక్స్ సోదాలు జరిగినప్పుడు వాటిని తెలుగు ఆత్మగౌరవంపై దాడిగా అభివర్ణించారు బాబు. ఇప్పుడు గోధ్రా అల్లర్లలో మోదీ పాత్ర గురించి బిబిసి కథనం వెలువరిస్తే నమ్మితే నమ్మవచ్చు, లేకపోతే ఊరుకోవచ్చు, కానీ భారత్‌పై ద్వేషం అంటే ఎలా నాయనా? సరే, మోదీ బిజెపి నాయకుడు, సంఘీయులకు ఆత్మీయుడు కాబట్టి బిబిసిపై విరుచుకు పడ్డారంటే సరేలే అనుకోవచ్చు. కానీ అదాణీపై హిండెన్‌బర్గ్ నివేదిక రాగానే, వాళ్లని చీల్చిచెండాడడం దేనికి? దేశభక్తిని, జాతి గౌరవాన్ని పిక్చర్‌లోకి తేవడం దేనికి? ఇలా చేస్తే మోదీకి, అదాణీకి తామే లింకు పెట్టినట్లవదూ?
పాలకులకు ఆత్మీయులైన వారు ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు, ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఓ కమిషన్ వేశామంటారు. ఆ కమిషన్ పని ఎప్పటికీ ప్రారంభం కాదు. ఆయనకు ఓ బల్లా, కుర్చీ కూడా యివ్వరు, సాక్షులను పిలిపించరు, ఫైళ్లు అప్పగించరు. ఓ ఏడాది పోయాక ఎవరో దీన్ని లీక్ చేస్తారు. అప్పుడు వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది. దేని గురించి? కేసు గురించి కాదు, యీ విషయాన్ని ఎవరు లీక్ చేశారు, వాళ్లని వేటాడండి అని పోలీసులను తరుముతుంది. ఇది దశాబ్దాలుగా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అదాణీ కేసులో కూడా హిండెన్‌బర్గ్‌కు సమాచారాన్ని యిచ్చి అదాణీ కంపెనీని దెబ్బ కొట్టినదెవరు? అనేదానిపై సంఘీయులు ఎక్కువ ఫోకస్ పెట్టారు.
సమాచారం యిచ్చినవారు ఎవరైనా కావచ్చు. అదాణీ గబగబా నిచ్చెనమెట్లు ఎక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోవడం చూసి అసూయ చెందిన సాటి వ్యాపారస్తులు కావచ్చు, తమ ఉన్నతాధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి చేస్తున్న అక్రమాలను నిరోధించలేక మనసు కష్టపెట్టుకున్న నియంత్రణ సంస్థల ఉద్యోగులు కావచ్చు, అదాణీ షేర్ల వ్యవహారంతో దెబ్బ తిన్న షేర్ ఆపరేటరు కావచ్చు. అంతెందుకు, తనను దాటి వెళ్లినందుకు ముకేశ్‌కు కూడా గుర్రుగా ఉండి, వాళ్లకు సహకరించవచ్చు. అదాణీ వ్యతిరేక కథనాలు వెబ్‌సైట్లలో వచ్చేట్లు చేయవచ్చు. కానీ ‘‘ఆర్గనైజర్’’ వెబ్‌సైట్ అటుతిప్పి, యిటుతిప్పి యీ కథనాలను అజీజ్ ప్రేమ్‌జీకి అంటగట్టింది. డబుల్ ధమాకా అన్నమాట. ఇక అతన్ని ఐఎస్ఐకు అంటుకట్టేస్తే ట్రిపుల్ ధమాకాయే!
ఏదైనా ఆరోపణ రాగానే దాన్ని వాస్తవాలతో ఎదుర్కోవడం మానేసి, అది ఎందుకు బయటపెట్టారు? ఎలా బయటకు వచ్చింది? అది పబ్లిష్ చేసినవారి కులమతగోత్రాలేమిటి? రాజకీయ అభిప్రాయాలేమిటి? వారి ఉద్దేశాలేమిటి? అని ఆరా తీయడం మామూలై పోయింది. పార్టీలే కాదు, ప్రభుత్వాలూ అంతే. ఈ ప్రభుత్వమూ అంతే. పార్లమెంటులో గంటల తరబడి ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న ఈడీ గురించి మాట్లాడారు తప్ప, దేశ ఆర్థికవ్యవస్థను కుదుపుతున్న అదాణీ వివాదంపై నోరెత్తలేదు. జాయింటు పార్లమెంటరీ కమిటీ వేయమన్న డిమాండుకు స్పందించలేదు. కోర్టు తానే విచారణ చేపడతానంటే ఆ విచారణ సంఘంలో సభ్యులెవరుండారో, ఏయే అంశాలపై విచారించాలో రాసి సీల్డ్ కవర్లో యిస్తానంది ప్రభుత్వం. అక్కరలేదు, మా తంటాలు మేం పడతాం అంది కోర్టు. ఈలోగా దీని గురించి మీడియా కథనాలు రాకుండా నిషేధించాలని కేసు పడేశారెవరో.
నిజానికి యిలాటి చేష్టలే అనుమానాల్ని పెంచుతాయి. కవరప్ చేసే ప్రయత్నాలన్నీ కౌంటర్ ప్రొడక్టివ్‌గా తేలతాయి. బోఫోర్స్ సమయంలో రాజీవ్ గాంధీ రియాక్షన్లు చూశాను. చివరకు బోఫోర్స్ లంచాలు ప్రూవ్ కాలేదు, దోషులు నిరూపించబడలేదు కానీ ప్రజల మెదళ్లలో రాజీవ్‌పై అనుమానం ముద్రించుకుని పోయింది. అఖండమైన మెజారిటీ నెగ్గిన ‘మిస్టర్ క్లీన్’ ఐదేళ్లు తిరిగేసరికి అధికారం పోగొట్టుకున్నాడు, అదీ ఒక అతుకులబొంత సంకీర్ణానికి! యుపిఏ అధికారం పోగొట్టుకున్నదీ, మోదీకి అధికారం దక్కినదీ అవినీతి అంశం మీదనే! ఆ యిమేజి నిలుపుకోవాల్సిన బాధ్యత మోదీపై, బిజెపిపై ఉంది. ఆర్థిక నేరస్తులను కాపాడుతున్నాడనే అభిప్రాయం జనాలకు కలిగితే అంతకంటె అనర్థం లేదు. ప్రభుత్వం ద్వారా, కోర్టుల ద్వారా వారికి రక్షణ కల్పించడం గత ప్రభుత్వాల్లో కూడా చూశాం.
ఇప్పుడు కొత్తగా చూస్తున్నదేమిటంటే అధికార పార్టీకి చెందిన సామాజిక సంస్థలు ఆరోపితుడికి (నేరస్తుడు అని యింకా అనలేం) అండగా ప్రజాభిప్రాయాన్ని మొబిలైజ్ చేయడం! అతని జోలికి వస్తే దేశద్రోహి అనే ముద్ర వేస్తామని హడలగొట్టడం! మోదీకి కుటుంబమే లేదు. డబ్బేం చేసుకుంటాడు? అని జనం నమ్మేసి ఊరుకోరు. ఆయనకు సొంతానికి కాకపోయినా పార్టీకి డబ్బు కావాలని అందరికీ తెలుసు. ర్యాలీలకు, ఎమ్మెల్యే, ఎంపీల ఫిరాయింపులకు, ఊరూరా విస్తరించడానికి, లక్షలాది పన్నా ప్రముఖులను పోషించడానికి డబ్బు కావాలి. పారిశ్రామికవేత్తల డబ్బు అనే యింధనం లేకుండా ఏ పార్టీ నడవదు. అదాణీ చేసినదంతా మోదీ నెత్తికి చుట్టడం తప్పు. అతను వీళ్లకు చెప్పి ఎంత చేస్తున్నాడో, చెప్పకుండా ఎంత చేస్తున్నాడో ఎవరికి ఎఱుక? రేపోమాపో అతను హాట్ పొటాటోగా మారే ముందే బిజెపి దూరం మేన్‌టేన్ చేయడం మంచిది. ఈలోగా సంఘీయులు అదాణీని భుజాన వేసుకుని మోయకుండా ఉంటే వారికే మంచిది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)