యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టారు. ప్రజాసమస్యల్ని తెలుసుకోవడం లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ఎవరు కృషి చేసినా అభినందించాల్సిందే. అందులోనూ రాజకీయాల్లోకి యువత సాధ్యమైనంత ఎక్కువ రావాలి. ఈ కోణంలో చూసినా లోకేశ్ పాదయాత్రను స్వాగతించాల్సిందే. అయితే పాదయాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుని, తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పరిష్కారం చూపుతారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో వుండింది.
కానీ లోకేశ్ ప్రసంగాలు వింటుంటే… ఒక్కటంటే ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేదు. పైగా అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకు ఇలాంటి వారసుడేందిరా సామి అనే నిట్టూర్పు మొదలైంది. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో 29వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారో తెలుసుకుందాం. ఆ తర్వాత జనం స్పందన ఏంటో చూద్దాం. ప్రసంగాన్ని తన అపారమైన అజ్ఞానంతో మొదలు పెట్టడం గమనార్హం.
“వెంకటేశ్వరస్వామి పాదాల దగ్గరి నుంచి మిమ్మల్ని ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని లోకేశ్ తన మార్క్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. మిమ్మల్ని ప్రసంగించడం ఏంటో ఆయనకే తెలియాలి. “మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం” అని చెప్పడానికి బదులు, ఆయన తలకిందులయ్యారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
“ఏమయ్యా జగన్ నీకెందుకంత భయం ఈ లోకేశ్ వస్తే అని అడుగుతున్నా. లోకేశ్‌ను అడ్డుకోడానికి వెయ్యి మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సీఐలు, ఆరుగురు డీఎస్పీలు, ఒక వజ్ర వాహనం, మూడు డ్రోన్లు, ఇంటెలిజెన్స్ అధికారులు” …. ఇలా చెప్పుకుంటూ పోయారు. రోజాను జబర్దస్త్ ఆంటీ అని లోకేశ్ ఎగతాళి చేస్తుంటారు. జబర్దస్త్‌లో రోజా జడ్జిగా మాత్రమే వ్యవహరించారు. కానీ లోకేశ్ ఏకంగా యువగళం పేరుతో జబర్దస్త్ లాంటి కామెడీ షోలో నటిస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తున్నారు. లోకేశ్‌ను అడ్డుకోడానికి ఇంత మందిని ప్రభుత్వం నియమిస్తుందా? మరీ కామెడీ కాకపోతే. ఈ లెక్కన లోకేశ్‌కు ప్రభుత్వమే జన సమీకరణ చేస్తున్నట్టుంది.
సీఎం జగన్ పాదం గురించి లోకేశ్ దెప్పి పొడవడం మరీ విడ్డూరంగా వుంది. లోకేశ్‌ను సోషల్ మీడియాలో ఉతికి ఆరేయడానికి మంచి కంటెంట్ ఇచ్చారు.
“జగన్‌రెడ్డిది దరిద్రపు పాదం. జగన్ సీఎం అయిన వెంటనే బోటు ప్రమాదంలో 51 మంది చనిపోయారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో 10 మంది, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 62 మంది చనిపోయారు. అలాంటి పాదాన్ని ఏమంటారమ్మా … దరిద్రపు పాదం”
లోకేశ్ నుంచి ఇలాంటి ఆణిముత్యాల్లాంటి మాటలు వచ్చినప్పుడు… యాడ పట్టుకొచ్చార్రా నాయనా! అనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పాల్గొన్న రెండు వరుస సభల్లో 11 మంది మృత్యువాత పడడం ఇంకా జనం మరిచిపోలేదు. అలాగే గోదావరి పుష్కరాల్లో బాబు ప్రచార పిచ్చి వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారనే ఉంది. అంతెందుకు తాను పాదయాత్ర మొదలు పెట్టిన రోజే సమీప బంధువు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై, శివరాత్రి రోజు ప్రాణాలు విడిచిన వైనాన్ని లోకేశ్ మరిచినట్టున్నారు. దరిద్రపు పాదం అంటేనే రాష్ట్రమంతా తండ్రీతనయుల వైపు వేలెత్తి చూపుతుందని తెలిసి కూడా, జగన్‌పై అసందర్భ విమర్శ చేయడం ద్వారా నెటిజన్లకు లోకేశ్ చేతి నుంచి పని పెట్టారు.