చంద్రబాబు నాయుడు పల్లకీ మోయాలని, తన భుజస్కందాల మీద నుంచి సవారీ చేయించి ఆయనను అధికార పీఠం మీదికి తీసుకురావాలని తెగ ఉత్సాహపడిపోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. తన ఆలోచనకు కార్యరూపం ఇవ్వకముందే, హ్యాండిచ్చారా? కమలంతో ప్రస్తుతం ఉన్న బంధమే బాగుందని, సినిమా షూటింగ్ షెడ్యూళ్ల మధ్య విరామంలో, షాట్ గ్యాప్ దొరికినప్పుడు సాగించే తన రాజకీయ ప్రస్థానానికి.. బిజెపితో మైత్రి సరిపోతుందని పవన్ భావిస్తున్నారా? అనే సందేహం ప్రజలకు ఇప్పుడు కలుగుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. స్వయంగా బరిలోకి దిగడానికి ధైర్యం చేయని జనసేన, ఎవరికి మద్దతిస్తుంది? అనేది ఆసక్తికరమైన చర్చే. నిజానికి సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పోటీ చేయడం ద్వారా తాము అధికారంలోకి వచ్చేస్తామని కలగంటూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా పంచుకోవాలి? అనే ఆలోచనలతో మధన పడుతున్న పవన్ కళ్యాణ్.. తెలుగుదేశంతో బంధానికి ఒక లిట్మస్ టెస్టులాగా ఎమ్మెల్సీ ఎన్నికలను వాడుకొని ఉండవచ్చు.
వారిద్దరూ కలిసి పోటీ చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో కనీసం సూచనప్రాయంగా ఈ ప్రయత్నం వలన తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
మరోవైపు ఈ పవన్ కళ్యాణ్ మౌనాన్ని భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజీగా మార్చుకుంటోంది. ఉత్తరాంధ్ర ప్రాంత పట్టభద్ర నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు మోహరించిన మాధవ్ విజయం కోసం పవన్ కళ్యాణ్ పేరును కూడా వాడుకుంటున్నారు. జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి గానే తాను రంగంలో ఉన్నట్టు మాధవ్ చెబుతున్నారు.
జనసేన మద్దతు బిజెపికి మాత్రమేనని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కమలదళం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దియోధర్ ప్రకటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ మౌనంగా ఉన్నంతవరకు ఈ కమల నాయకుల మాటలు నిజం అనే అనుకోవాల్సి ఉంటుంది.
ఆ రకంగా గమనిస్తే.. ‘తనది వన్ సైడ్ లవ్’ అంటూ సిగ్గు విడిచి చెప్పుకున్న చంద్రబాబు నాయుడు తో పొత్తు బంధం ఏదీ ఏర్పడక ముందే.. పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లుగా అనుకోవాల్సి ఉంటుంది. కనీసం ‘ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము దూరం’ అనేంత మేరకు అయినా.. జనసేన ప్రకటిస్తే తప్ప.. వచ్చే ఎన్నికలకు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ఊహించడం కష్టం అని ప్రజలు అనుకుంటున్నారు.