ఏపీ సర్కార్‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానంలో రాజధాని విషయమై ఏదో ఒకటి తేలితే, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవాలని ఏపీ సర్కార్ ఉంది. కానీ తాను అనుకున్నట్టుగా విచారణ ముందుకు సాగడం లేదు. మరోసారి విచారణ మార్చి నెలాఖరుకు వాయిదా పడింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిట్టూర్చుతోంది.
రాజధాని అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. త్వరగా విచారించాలని గతంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. ఈ కేసును జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారిస్తోంది. రాజధాని విషయమై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు వచ్చారని, అంత ఇంపార్టెంట్ అని భావిస్తుంటే, అప్పుడే ఎందుకు రాలేదని ధర్మాసనం కీలక ప్రశ్ని సంధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రకరకాల కారణాలతో విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మరోసారి ఇవాళ విచారణ జరిగింది. ఇకపై విచారణ వేగంగా జరుగుతుందని, సాధ్యమైనంత త్వరగా తీర్పు వస్తుందని ఏపీ సర్కార్ ఆశించింది. అయితే అందుకు విరుద్ధమైన నిర్ణయం వెలువడింది. మార్చి 28న తిరిగి విచారిస్తామంటూ ధర్మాసనం అప్పటి వరకూ వాయిదా వేసింది. దీంతో ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసేదేమీ లేక నిట్టూర్చారు.
మరోవైపు విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలుకుని, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు త్వరలో విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతున్నారు. ఉగాది నాటికి సీఎం విశాఖ వెళ్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు ఉగాది తర్వాత రాజధాని వ్యవహారంపై విచారణ జరగనుండడం గమనార్హం.