భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తులు పెట్టుకుని 2014లో మాదిరిగానే ఈసారి కూడా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు చివరికంటా ప్రయత్నం చేశారు. వర్కవుట్ కాలేదు. కమదళం ఆయనను నమ్మలేదు. ఇప్పుడిక కమల నాయకులను తమ పార్టీలో కలిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులకు కలసి రాని పార్టీని ఖాళీ చేయించి, ఆ మేరకు తెలుగుదేశాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా రుజుమార్గంలో చేస్తున్న ప్రయత్నాలు కాదు. ఇందులో అనేక వక్ర వ్యూహాలు, తప్పుడు మార్గాలు ఉన్నాయి. బిజెపి నాయకులను తెలుగుదేశంలో కలిపేసుకోవడానికి, చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా తనకు అలవాటైన మైండ్ గేమ్ అతి తెలివితేటలను ప్రదర్శిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ మాజీ సారథి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరడం పెద్ద విశేషం కాదు. పార్టీలో చేరినప్పుడే కులం కార్డును వాడుకొని అధ్యక్ష హోదా దక్కించుకున్న కన్నా లక్ష్మీనారాయణ, నిజం చెప్పాలంటే అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి, అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆయనకు జాతీయ కార్యవర్గంలో పదవి కట్టబెట్టినప్పటికీ.. ఆయన చురుగ్గా పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నది లేదు.
ఎప్పటినుంచో మనసులో ఉన్న వ్యూహానికి ఇప్పుడు కార్యరూపం ఇచ్చారు. వేరే గతిలేక చంద్రబాబు నాయుడు పంచన చేరారు. అయితే ఇతర తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవలసిన ఖర్మ మిగిలిన బీజేపీ నాయకులకు లేదు. కానీ తన అతి తెలివితేటలు, మైండ్ గేమ్ ద్వారా వారిని లోబరుచుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.
‘ కమలదళంలోని నాయకులు కొందరు తెలుగుదేశం లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు..’ అనే అబద్ధపు ప్రచారాలను తన పచ్చ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. తద్వారా ఆయా నాయకులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ నాయకుల మీద పార్టీలో అనుమానం మొదలయ్యేలా చేస్తున్నారు. ఈ చంద్రవ్యూహంలో చిక్కుకొని వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
నెమ్మది నెమ్మదిగా పార్టీ తమను అనుమానంగా చూస్తున్నందున, పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడమే బెటర్ అనుకునే పరిస్థితి ఏర్పడేలా చేయాలనేది చంద్రబాబు నాయుడు స్కెచ్. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కన్నా లక్ష్మీనారాయణను ఇంటికి వెళ్లి కలిస్తే.. అక్కడికేదో ఆయన కూడా పార్టీ మారిపోతున్నట్లుగా ప్రచారం చేశారు. కడప జిల్లాలోని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తెలుగుదేశంలో చేరబోతున్నారంటూ ఒక ప్రచారం మొదలైంది.
ఇలా అంతో ఇంతో కీలకమైన అనేకమంది నాయకుల పేర్లతో ముడిపెట్టి వారి క్రెడిబిలిటీని దెబ్బతీసేలా ఫిరాయింపు దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పచ్చ మీడియా ద్వారా నిరాటంకంగా సాగిస్తుంది. ఈ మాయోపాయాలు ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.