నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 29వ రోజు చంద్రగిరి నియోజక వర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా తొండవాడలో బహిరంగ సభ నిర్వహించారు. లోకేశ్ ప్రసంగిస్తూ చంద్రబాబునాయుడు లాంటి నాయకుడు వచ్చిన ప్రాంతం ఇది అని గొప్పలు చెప్పారు. ఇదే నియోజకవర్గంలోని నారావారిపల్లె చంద్రబాబు స్వస్థలం.
చంద్రగిరి నియోజక వర్గంలో మన పార్టీ గెలవక 30 ఏళ్లవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరి సారిగా 1994లో టీడీపీ గెలిచిందన్నారు. ఈ దఫా అయినా టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. చంద్రగిరి నుంచి పులివర్తి నాని పోటీ చేస్తారని, భారీ మెజార్టీతో గెలిపించారని అభ్యర్థించడం గమనార్హం.
1994లో టీడీపీ తరపున చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారిపై గెలుపొందారు. ఆ తర్వాత ఎప్పుడూ టీడీపీని చంద్రబాబు సొంత నియోజకవర్గ ప్రజలు ఆదరించకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారి ఆ నియోజకవర్గంలో తిరుగులేని నాయకురాలు. వైసీపీ ఆవిర్భావం తర్వాత…చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ పార్టీ తరపున పట్టు సాధించారు.
రాష్ట్రంలోని పేరున్న గల్లా అరుణకుమారిపై చెవిరెడ్డి గెలవడం ఓ సంచలనమే. రోజురోజుకూ చంద్రగిరిలో చెవిరెడ్డి తన పట్టు పెంచుకుంటున్నారు. చెవిరెడ్డిని ఓడించడం టీడీపీకి అతిపెద్ద సవాల్‌గా మారింది. పులివర్తి నానీకి రెండో దఫా చెవిరెడ్డిపై కత్తి కట్టారు. అయితే ఆయన్ను ఎదుర్కోవడం పులివర్తికి అంత సులువు కాదు.