ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నారు. మనీశ్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, వాటిపైకి కేంద్ర దర్యాప్తు సంస్ధలను ఉసిగొలుపుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
మరో మంత్రి హరీశ్ రావు కూడా బీజేపీపై విమర్శలు చేశారు.. సిసోడియా అరెస్టు బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, బీజేపీ ఆప్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని, ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక సిసోడియాను ఆరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు.
దేశంలోని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని, బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట సిసోడియా అరెస్ట్ అంటూ, దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్ధితులు కొనసాగుతున్నాయని.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపై మాత్రమే కేంద్ర నిఘా సంస్ధలు పని చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో పాటు పలువురికి సంబంధం ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇప్పటికే మద్యం స్కాంలో కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా సిసోడియా అరెస్ట్ తర్వాత సీబీఐ, ఈడీ.. కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.