తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ వైసీపీ టికెట్ కోసం గ్రూప్-1 అధికారి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి ఆ అధికారి రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కనబరుస్తున్నారు. పీలేరు నియోజకవర్గానికి చెందిన ఆ అధికారి ఎస్సీ (మాల). గతంలో టీడీపీ తరపున సత్యవేడు టికెట్‌ను ఆశించారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, పిచ్చాటూరు, పీలేరు తదితర మండలాల్లో తహశీల్దార్‌గా పని చేశారు.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అతన్ని ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తొలగించింది. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వర్తించారు. అధికారంలో ఉన్న పార్టీతో సన్నిహితంగా మెలుగుతుంటారని పేరు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇతను పీలేరు తహశీల్దార్‌గా పని చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తనకు అనుకూలంగా వ్యవహరించాడనే కృతజ్ఞతతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రభుత్వం రాగానే తన నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ తహశీల్దార్‌గా వేయించుకున్నారు.
రెండేళ్లకు డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ పొందారు. దీంతో ఆయన్ను తన ఓఎస్డీగా చెవిరెడ్డి నియమించుకున్నారు. డబ్బు బాగా సంపాదించాడనే పేరున్న ఆ అధికారికి రాజకీయాల్లోకి వెళ్లి, ఎమ్మెల్యే కావాలనే కోరిక పుట్టింది. దీంతో గూడూరు టికెట్ ఇప్పిస్తానని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనకు హామీ ఇచ్చినట్టు సదరు అధికారి ప్రచారం చేసుకుంటున్నారు. అసలే గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై ఆ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వుంది.
దీంతో ఈ దఫా వరప్రసాద్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ నియోజక వర్గ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని, రానున్న ఎన్నికలకు బలమైన పునాది వేసుకునే క్రమంలో చెవిరెడ్డి ద్వారా కీలక పోస్టు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా సమానంగా నియోజకవర్గ ప్రజలకు తన పేరు తెలిసేలా చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ముందు చూపుతో సదరు అధికారి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం ఆ నియోజకవర్గంలో సాగుతోంది. ఇదే సందర్భంలో ఆయన అంటే వైసీపీ గిట్టని నాయకులు కూడా లేకపోలేదు. ఇవన్నీ ఛేదించి, తనకు చెవిరెడ్డి టికెట్ ఇప్పిస్తారనే నమ్మకంతో ఆ అధికారి ఉన్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.