అమ‌రావ‌తా? టీడీపీ ప‌రిర‌క్ష‌ణా?

పేరుకు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం. ఆచ‌రణ‌కు వ‌చ్చే స‌రికి అంతా టీడీపీ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మ‌మే. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ నేతృత్వంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే… అడుగ‌డుగునా తెలుగుదేశం పార్టీని ఎలా కాపాడుకోవాలి? మ‌రోసారి అధికారంలోకి తేవాల‌నే…

పేరుకు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం. ఆచ‌రణ‌కు వ‌చ్చే స‌రికి అంతా టీడీపీ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మ‌మే. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ నేతృత్వంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీలిస్తే… అడుగ‌డుగునా తెలుగుదేశం పార్టీని ఎలా కాపాడుకోవాలి? మ‌రోసారి అధికారంలోకి తేవాల‌నే ప‌ట్టుద‌లే క‌నిపిస్తున్నాయి. 

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఉద్య‌మానికి భారీగా విరాళాల సేక‌ర‌ణ దేనికి సంకేతం? విరాళాలు ఇస్తున్న ఏకైక సామాజిక వ‌ర్గం ఏంటో జ‌గ‌మెరిగిన స‌త్యం. నిజం నిప్పులాంటి. ఈ మాట‌లు కొంద‌రికి కోపం తెప్పించొచ్చు.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేతృత్వంలో అమ‌రావ‌తిలోనే ఏకైక రాజ‌ధాని కొన‌సాగించాల‌నే ఉద్య‌మం వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను బాబు సామాజిక‌వ‌ర్గ‌మే ఏలాలి, అలాగే సంప‌దంతా వాళ్ల చేతుల్లోనే ఉండాలి, క‌మ్మ సామాజిక వ‌ర్గం అధికార ప‌ల్ల‌కీని మోసేందుకు మిగిలిన సామాజిక వ‌ర్గాల‌ను క‌లుపుకెళ్లేందుకు ఇత‌రేతర పేర్ల‌తో ఉద్య‌మాన్ని న‌డ‌పాలి. 

ఇది ఆ ఉద్య‌మంలో అంత‌ర్లీనంగా ఉన్న ఎజెండా. చివ‌రికి సిద్ధాంత ప‌రంగా బ‌ద్ద‌విరోధులైన వామ‌ప‌క్షాలు, బీజేపీ క‌లిసి న‌డుస్తున్నాయంటే…. ఇది ముమ్మాటికీ కుల ఐక్య‌తే త‌ప్ప‌, మ‌రొక‌టి కానేకాద‌నే అభిప్రాయాల్ని కొట్టిపారేయ‌లేని ప‌రిస్థితి.

న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర కూడా ముగిసింది. అనంత‌రం ఈ నెల 17న తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ వివ‌రాల‌ను అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి క‌న్వీన‌ర్ శివారెడ్డి, కో-క‌న్వీన‌ర్ తిరుప‌తిరావు వెల్ల‌డించారు. 

రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ చాటుతామ‌ని వారు వెల్ల‌డించారు. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ మ‌హోద్య‌మ స‌భ నిర్వ‌హించనున్న‌ట్టు తెలిపారు. ఈ స‌భ‌కు వైసీపీ మిన‌హా కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల‌ను ఆహ్వానిస్తున్న‌ట్టు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

అమ‌రావ‌తిని రాజ‌ధానికి ఎలాంటి ప‌రిస్థితుల్లో ఏర్పాటు చేశారో గ‌తంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, వామ‌ప‌క్ష నాయ‌కులు, బీజేపీ నేత‌లు ప‌లు వేదిక‌ల మీదుగా బ‌లంగా చెప్పారు. క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌నేది టీడీపీ మిన‌హా మిగిలిన అన్ని పార్టీల డిమాండ్‌. ఈ ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తిలోనే అన్నీ ఉండాల‌నే డిమాండ్‌పై ఏర్పాటు చేస్తున్న స‌భ‌కు ఈ పార్టీల‌న్నీ ఎలా వెళ్తాయో అర్థం కాని ప్ర‌శ్న‌. 

టీడీపీని మ‌ళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ప్ర‌ధానంగా బీజేపీ-జ‌న‌సేన కూట‌మిని చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర చేసేందుకే త‌ప్ప‌…మ‌రే ఆశ‌యం క‌నిపించ‌డం లేదు. ఇది స‌త్యం. రానున్న రోజుల్లో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుందని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.