టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియా, జగన్ వ్యతిరేక శక్తులన్నీ ఇటీవల చేస్తున్న ఓ వాదనలో లాజిక్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల జస్టిస్ చంద్రు ఏపీ పర్యటనలో భాగంగా న్యాయ వ్యవస్థకు కొన్ని ప్రశ్నలు సంధించారు.
ఆ వ్యవస్థ విధానాలను విమర్శించారు. ఇందులో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. విభేదించడం కూడా ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కును అందరూ గౌరవించాలి, కాపాడుకోవాలి. ఆ బాధ్యత అందరిపై ఉంది.
అయితే జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టును ప్రశ్నించడం, విమర్శించడమే తప్పు అన్న ధోరణులు దేనికి సంకేతం? ఇదేనా భావ ప్రకటనా స్వేచ్ఛకు అర్థం. అందులోనూ ఏపీ హైకోర్టును ప్రశ్నించింది సామాన్యమైన వ్యక్తి కాదు. ఏకంగా జైభీమ్ అనే సినిమా అవతరణకు కారణమైన రియల్ క్యారెక్టర్. మొత్తం న్యాయ వ్యవస్థకే రోల్ మోడల్‌గా నిలిచిన గొప్ప ఆదర్శమూర్తి జస్టిస్ చంద్రు.
జస్టిస్ చంద్రు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు తప్ప, మిగిలిన పనికిమాలిన విషయాలన్నీ తెరపైకి రావడం ఏపీ రాజకీయ దురవస్థను తెలియజేస్తోంది. ఏపీ హైకోర్టును ప్రశ్నించడం అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సమర్థించడమని ఎల్లో బ్యాచ్ ఎలా అంటున్నదో అర్థం కావడం లేదు. ఏపీ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం శత్రువనే భావన సృష్టించే ప్రయత్నంగా వీళ్ల మాటలు తెలియజేస్తున్నాయి.
అందరికీ న్యాయం చేసే ఏపీ హైకోర్టు, తనకు ఎలా న్యాయం చేసుకోవాలో బాగా తెలుసు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అసలు చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది గౌరవ హైకోర్టు ఆలోచిస్తుంది. హైకోర్టు న్యాయమూర్తులపై చంద్రబాబు, ఎల్లో మీడియా సానుభూతి అవసరం లేదు. జస్టిస్ చంద్రు వ్యాఖల్యపై ఇప్పటికే ఏపీ హైకోర్టు తన స్పందన తెలియజేసింది. అయినప్పటికీ రాజకీయం చేసేందుకే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.
మాజీ న్యాయమూర్తులకు పదవులు ఆశ చూపి వారితో రాష్ట్రంలో పాలనపై సర్టిఫికెట్లు ఇప్పించుకొంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇదేమైనా స్వీయ అనుభవంతో చెబుతున్నారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే…ఏం సమాధానం చెబుతారు? గతంలో తన అక్రమాస్తులపై వైఎస్ విజయమ్మ కేసు, అది కొట్టివేత, అనంతర ఫలాలపై న్యాయ వర్గాలు కథలుకథలుగా చెప్పుకుంటాయి. తాజాగా బాబు వ్యాఖ్యలు విన్నవారెవరికైనా ఆ సంగతులు గుర్తు రాకుండా ఉండవు.
తమిళనాడు నుంచి ఒక విశ్రాంత న్యాయమూర్తి ఇక్కడకు వచ్చి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటారని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం వారికి కనిపించవా? అని ప్రశ్నించారు.
జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు చూడరా? అని నిలదీశారు. ఒక ఆర్థిక నేరస్థుడికి ఇటువంటి వాళ్లు మద్దతు ఇవ్వవచ్చా? అని ప్రశ్నించారు. పదవీ విరమణ తర్వాత వీరిలో కొందరికి పదవులు కావాలని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జస్టిస్ చంద్రు ప్రధానంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి. అందులోని లోపాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. అంతకు ముందు ఆయన ది హిందూ జాతీయ దినపత్రికలో కూడా తాను ఆర్టికల్ రాసినట్టు గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలన గురించి విమర్శించడానికి ఆయనేమీ రాజకీయ నాయకుడు కాదు. అంతేకాదు, తాము కోరుకున్నట్టు మాట్లాడ్డానికి ఆయనేమీ తమరు నియమించిన జడ్జి అంతకంటే కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
పదవీ విరమణ తర్వాత పదవులు కావాలని ఆశిస్తుండడం వల్లే జస్టిస్ చంద్రు హైకోర్టుపై ఘాటు విమర్శలు చేశారని ఆరోపిస్తున్న చంద్రబాబుకు పౌర సమాజం, నెటిజన్లు ఓ ప్రశ్న వేస్తున్నారు. ఇంతకూ ఓ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రును టార్గెట్ చేయడం వెనుక ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి, ఎవరి మనసులను రంజింప చేసి, ఎలాంటి ప్రయోజనాలు పొందడానికో బాబు చెప్పాలనేది ప్రశ్న.
బాబూ…మీ మాటల వెనుక మర్మమేంటో తెలియని అమాయక స్థితిలో ఏపీ సమాజం లేదని గుర్తించుకుంటే చాలు. అందుకే నాటకాలు ఇక కట్టిపెడితే మంచిదని లోకం హితవు చెప్పేది.