ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన వేర్వేరు బహిరంగ సభలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్కంఠకు తెరదించుతూ రెండు సభలకూ అనుమతి ఇవ్వడం గమనార్హం.
అమరావతి రైతులు తమ పాదయాత్ర పూర్తి చేసుకుని, శ్రీవారి దర్శనానంతరం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం తిరుపతి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే శాంతిభద్రతల సమస్య దృష్ట్యా సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే సందర్భంలో రాయలసీమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయంపై ప్రజానీకాన్ని చైతన్యపరిచే క్రమంలో ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని రాయలసీమ మేధావుల ఫోరం నిర్ణయించింది. ఇందుకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో తమకు సభ నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాయలసీమ మేధావుల ఫోరం హైకోర్టును ఆశ్రయించింది.
ఈ రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సభకు అనుమతి కోరుతూ ఈ నెల 3న అమరావతి పరిరక్షణ సమితి, అలాగే ఈ నెల 6న రాయలసీమ మేధావుల ఫోరం తమను ఆశ్రయించిన నేపథ్యంలో …మొదట వచ్చిన వాళ్లకి మొదటి ప్రాధాన్యం కింద అమరావతి రైతులు కోరుకున్నట్టుగానే 17న సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
ఈ సందర్భంగా అధికారులపై విమర్శలు చేయొద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని, అలాగే కోవిడ్ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు షరతులు విధించింది.
ఇక రాయలసీమ మేధావుల ఫోరానికి ఆ మరుసటి రోజు అంటే 18వ తేదీ సభ నిర్వహణకు అనుమతి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అనుమతుల విషయమై నెలకున్న ఉత్కంఠకు హైకోర్టు తెరదించినట్టైంది.